చంద్రబాబు ఆరాలు దేనిగురించో తెలుసా?

Update: 2017-07-30 04:33 GMT
హైదరాబాదు నగర పర్యటన పెట్టుకున్న చంద్రబాబునాయుడు.. తీవ్రమైన కార్యక్రమాల ఒత్తిడి మధ్యలోనూ పనిగట్టుకుని వెళ్లి రాష్ట్ర గవర్నరును కలిశారు. నరసింహన్ తో ఆయన భేటీ అయి అనేక విషయాలపై చర్చించారు. భేటీ ముగిసిన తర్వాత.. తానుగా ఏమీ వివరాలు వెల్లడించకుండానే వెళ్లారు. కాకపోతే.. విభజన చట్టంలోని అంశాలన్నీ వెంటనే అమలయ్యేలా చొరవ చూపించాలని, 9-10 షెడ్యూల్ లలోని అంశాలన్నీ అమల్లోకి వచ్చేలా చూడాలని ఆయన కోరినట్లుగా వార్తలు వచ్చాయి. కాకపోతే.. మరికొన్ని రాజకీయ ఆరాలు కూడా తీయడానికి చంద్ర బాబు ప్రయత్నించి ఉండొచ్చునని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కొన్ని రోజుల కిందట ఏపీలో విపక్షనేత జగన్మోహన్ రెడ్డి  - గవర్నర్ ను కలిశారు. జగన్ వెళ్లి గవర్నర్ తో భేటీ కాగానే.. తెలుగుదేశం నాయకులందరికీ విపరీతమైన భయాందోళనలు పుట్టాయి. జగన్ ఒక విపక్ష నాయకుడు.. కేబినెట్ హోదా ఉన్న నేత. అవన్నీ వారు గమనంలో ఉంచుకోకుండానే.. జగన్ ఎందుకు వెళ్లి గవర్నర్ ను కలిశాడో, ఏం మాట్లాడాడో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆయన తన మీద కేసుల గురించే మాట్లాడ్డానికి గవర్నర్ వద్దకు వెళ్లాడు.. లాంటి అనవసరపు ఆరోపణలన్నీ గుప్పించారు. నిజానికి ఇప్పుడు చంద్రబాబునాయుడు వెళ్లి గవర్నర్ ను కలిసినా సరే.. తన మీద ఉన్న ఓటు నోటు కేసు విషయంలో తెలంగాణ సర్కారు ఇంకాస్త మెత్తబడేలా చూడాల్సిందిగా రిక్వెస్టు చేసుకోవడానికే వెళ్లాడని ఆరోపిస్తే ఎలా ఉంటుంది..! కానీ అలా జరగడం లేదు.

నిజానికి రాజకీయ వర్గాల్లో చెలామణీ అవుతున్న పుకార్లను బట్టి.. ఇటీవల జగన్ వచ్చి భేటీ అయిన సంగతి కూడా చంద్రబాబు –నరసింహన్ చర్చల్లోకి వచ్చి ఉండచ్చునని అనుకుంటున్నారు. కేవలం ఒకటి రెండు విషయాలు మాట్లాడ్డానికి పనిగట్టుకుని వెళ్లి భేటీ అయ్యే అవసరం లేదని, ఆ ముందురోజే రామోజీరావు మనవరాలి పెళ్లిలో గవర్నర్ చంద్రబాబు చాలా సమయమూ కలిసి గడిపారని అనికూడా వినిపిస్తోంది. మొత్తానికి విపక్ష నేత జగన్ ఫ్యాక్టర్ పట్ల చంద్రబాబులో ఆలోచన కాస్త ఎక్కువగానే సాగుతున్నట్లుందని పలువురు భావిస్తున్నారు.
Tags:    

Similar News