అంత చిన్న దానికే చంద్రబాబు బెంబేలెత్తాడా?

Update: 2015-09-15 16:14 GMT
సాక్షాత్తూ నారా లోకేశ్‌ స్వయంగా మీడియా ముందు వెల్లడిస్తున్నప్పటికీ.. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు నమ్మలేకపోతున్నారు. తమ పార్టీ అధినేత శక్తి సామర్థ్యాల మీద వారికి ఉన్న విశ్వాసం అలాంటిది. ముప్పయ్యేళ్లకు పైబడిన సుదీర్ఘమైన అనుభవం ఉన్న రాజకీయ దురంధరుడు, తన ప్రస్థానంలో ఎన్నెన్నో ఢక్కామొక్కీలు తిన నిలదొక్కుకున్న నాయకుడు, ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలనుంచి ఎందరెందరో మహామహుల్ని ఢీకొని మనగలిగిన ధీరోదాత్తుడు.. అయిన తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అంత చిన్న విషయానికి బెంబేలెత్తిపోయారంటే.. పార్టీకార్యకర్తలకు నమ్మబుద్ధి కావడంలేదు. కాకపోతే.. చెప్పింది స్వయానే లోకేశే గనుక.. అవునేమో అని వారనుకుంటున్నారు.

అయినా, వెయ్యిగొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కుప్పకూలుతుందని సామెత. ఇప్పుడు చంద్రబాబు విషయంలో అది నిజమే ఏమో అని పలువురు అనుకుంటున్నారు. ఇంతకూ విషయం ఏంటంటే.. చంద్రబాబునాయుడు తన నివాసాన్ని పూర్తిగా ఏపీ పరిధిలోకి షిఫ్ట్‌ చేసేసుకుని గుంటూరుజిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసుకున్న క్యాంపు కార్యాలయంలోనే ఉంటూ.. పూర్తిస్థాయిలో అక్కడినుంచి ముఖ్యమంత్రి పనులను చేస్తూ ఉన్నారు. ఇదంతా ఎడ్మినిస్ట్రేషన్‌ పరంగా ఏపీ సౌలభ్యం కోసమే అని జనం అనుకుంటూ ఉన్నారు. అయితే మంగళవారం నాడు నారా లోకేష్‌ మాటలను విన్నతర్వాత.. హైదరాబాదులో ఫోను ట్యాపింగ్‌ జరుగుతున్నదని భయపడి చంద్రబాబు విజయవాడకు తరలిపోయినట్లుగా ప్రజలకు అర్థమవుతోంది.

'హైదరాబాదులో ఉండి ఫోను ట్యాపింగ్‌ చేయించుకోడం కంటె.. సొంత రాష్ట్రంలో ఉండి పరిపాలన సాగించడం బెటర్‌' అని లోకేష్‌ మంగళవారం వ్యాఖ్యానించారు. చంద్రబాబు తరలిపోయేలా ఆయనను బెంబేలెత్తించిన విషయం ట్యాపింగేనా? అని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. నిజానికి ఫోను ట్యాపింగ్‌ సంగతి తన దృష్టికి వచ్చిన వెంటనే చంద్రబాబునాయుడు దానిమీద పెద్దఎత్తునే పోరాటం ప్రారంభించారు. ఢిల్లీ వెళ్లి కేంద్రానికి ఫిర్యాదుచేసినా వారు పెద్దగా స్పందించలేదు. ఏపీలో కేసులు పెట్టించి, సిట్‌ ఏర్పాటుచేసి.. సెల్‌ కంపెనీ ఆపరేటర్లను నయానభయానా మెడలు వంచి.. మొత్తానికి తెలంగాణ సర్కారు ట్యాపింగ్‌ను ఒప్పుకునేలా చేశారు. అయితే.. ఇంకా ఆయనకు ఆ భయం మాత్రం పోలేదని లోకేశ్‌ మాటలను బట్టి తెలుస్తోంది. అంత చిన్న సమస్యను ఎదుర్కొనలేక ఇంత రాజకీయ అనుభవజ్ఞుడు హైదరాబాదు నగరం మీద తన అధికారాలన్నీ వదలుకుని తొమ్మిదేళ్ల ముందే వెళ్లిపోవడం ఆశ్చర్యకరమే.
Tags:    

Similar News