హాట్ టాపిక్‌:మోడీ కోస‌మే గుజ‌రాత్ షెడ్యూల్ లేట్‌?

Update: 2017-10-25 08:47 GMT
అసెంబ్లీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఒక‌టి కంటే ఎక్కువ రాష్ట్రాలు ఉన్న‌ప్పుడు.. అన్నింటికి క‌లిపి ఒకేసారి షెడ్యూల్ ప్ర‌క‌టించ‌టం రివాజే. అయితే.. తాజాగా మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. మొన్నామ‌ధ్య హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించిన వేళ‌.. గుజ‌రాత్ షెడ్యూల్ కూడా ప్ర‌క‌టిస్తార‌ని భావించారు.

కానీ.. అందుకు భిన్నంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ షెడ్యూల్ మాత్ర‌మే ప్ర‌క‌టించి.. గుజ‌రాత్ ఎన్నిక‌ల షెడ్యూల్‌ ను త‌ర్వాత ప్ర‌క‌టిస్తామ‌న్న మాట‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం చెప్పింది. ఎందుకిలా అన్న సందేహానికి ఈసీ ఇచ్చిన స‌మాధానం ఏమిటంటే.. ఇటీవ‌ల సంభ‌వించిన వ‌ర‌ద‌ల కార‌ణంగా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో అధికారులు ఉన్నార‌ని.. అందుకే షెడ్యూల్‌ ను ఆల‌స్యంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లుగా చెప్పింది.

దీనిపై విప‌క్షాలు సందేహాలు వ్య‌క్తం చేయ‌టంతో పాటు.. సోష‌ల్ మీడియాలో ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఇప్పుడ‌వి నిజ‌మ‌న్న రీతిలో ఒక అంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది. గుజ‌రాత్ ఎన్నిక‌ల షెడ్యూల్‌ ను విడుద‌ల చేయ‌టానికి ఆల‌స్యంగా చెప్పిన స‌హాయ‌క చ‌ర్య‌ల గురించి ఈసీకి రాష్ట్ర స‌ర్కారు కానీ.. అధికారులు కానీ చెప్ప‌లేద‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

మ‌రి.. ఎవ‌రూ కోర‌కుండానే ఎన్నిక‌ల సంఘం త‌న‌కు తానుగా షెడ్యూల్‌ ను ఆల‌స్యంగా ప్ర‌క‌టించాల‌ని నిర్ణ‌యించిందా? అన్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. అలా ఎందుక‌న్న ఉప ప్ర‌శ్న కూడా ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌గా మారింది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించిన రెండు వారాల త‌ర్వాత నేడు ప్ర‌క‌టిస్తున్న గుజ‌రాత్ ఎన్నిక‌ల షెడ్యూల్ వ్య‌వ‌హారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మోడీ ఇమేజ్‌ కు లిట్మ‌స్ టెస్ట్ లాంటి గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీరును ఇప్పుడు ప‌లువురు ప్ర‌శ్నిస్తుండ‌టం గ‌మ‌నార్హం. గుజ‌రాత్ ఎన్నిక‌ల షెడ్యూల్ ఆల‌స్యంపై ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ అచ‌ల్ కుమార్ జోతి చెప్పిన స‌మాధానానికి కౌంట‌ర్ అన్న‌ట్లుగా గుజ‌రాత్ వ‌ర‌ద స‌హాయ‌క క‌మిష‌న‌ర్ ఏజే షా ఓ ఆంగ్ల మీడియా సంస్థ‌తో మాట్లాడిన మాట ఇప్పుడు కొత్త సందేహాల‌కు తావిచ్చేలా ఉంది. వ‌ర‌ద స‌హాయ‌క ప‌నులు ఉన్నాయంటూ త‌మ శాఖ నుంచి ఎవ‌రూ ఈసీని చెప్ప‌లేద‌ని.. ఆ మాట‌కు వ‌స్తే స‌హాయ‌క చ‌ర్య‌లు ఎప్పుడో పూర్తి అయిన‌ట్లుగా ఆయ‌న చెబుతున్నారు. మ‌రి.. ఎవ‌రి కోసం ఎన్నిక‌ల షెడ్యూల్‌ ను రెండు వారాలు ఆల‌స్యంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన‌ట్లు..?
Tags:    

Similar News