గద్దర్ కు ఏంటీ దుస్థితి.. కుమారుడి కోసం.?

Update: 2018-10-30 14:30 GMT
విప్లవ యోధుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఇప్పుడు ఒక్కటే లక్ష్యం పెట్టుకున్నారట.. అది అలాంటి ఇలాంటి మిషన్ కాదు.. పేదలకు సేవ చేయడం.. అడవుల్లోకి వెళ్లి పోరాటం చేయడం.. ప్రజా ఉద్యమాలు చేయడం లాంటివన్నీ ఎప్పుడో పక్కనపెట్టేసిన గద్దర్ ఈ మధ్యకాలంలో సామాజిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇటీవలే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ లో చేరినట్టే ప్రచారం పొందారు.  ఇప్పుడు తన భవిష్యత్ కంటే కుమారుడు సూర్య కిరణ్ ను ఎమ్మెల్యే చేయడంపైనే గద్దర్ ఫుల్ ఫోకస్ పెట్టారట.. అతడికి ఎలాగైనా కాంగ్రెస్ టికెట్ ఇప్పించాలని కృతనిశ్చయంతో ప్రయత్నాలు చేస్తున్నాడట..

గద్దర్ తన కుమారుడికి కాంగ్రెస్ టికెట్ కోసం పెద్ద లాబీయింగే చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. తన కుమారుడికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇస్తే గజ్వేల్ లో కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని  సోనియా - రాహుల్ గాంధీలకు హామీ ఇచ్చాడట.. ప్రస్తుతానికి గద్దర్ కాంగ్రెస్ లో అధికారికంగా చేరకున్నా.. కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు రెడీ అయ్యారట..

గద్దర్ తన కుమారుడి కోసం మొదట చెన్నూర్ నియోజకవర్గ సీటును ఆశించారు. అక్కడ బలమైన నేత ఉండడంతో ఇప్పుడు బెల్లంపల్లి ఇచ్చినా పోటీచేయడానికి నిర్ణయించుకున్నారట.. ఇప్పటికే సూర్య కిరణ్ బెల్లంపల్లిలో విస్తృతంగా పర్యటిస్తూ తన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

గద్దర్ తెలంగాణ ఉద్యమంలో చుక్కాని అయి నిలిచారు. ఉద్యమానికి దశాదిశా నిర్ధేశం చేశారు. సామాజిక అంశాలను లేవనెత్తి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆయన ఉద్యమకాలంలో పాడిన ‘పొడుస్తున్న పొద్దుమీద’ పాట ఎంతో హిట్ అయ్యింది. అంతటి ప్రజా యుద్ధనౌక ఇప్పుడు తన కుమారుడి కోసం కాంగ్రెస్ దగ్గర చేయిచాచడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. తన కుమారుడి భవిష్యత్ కోసం నైతిక విలువలు వదిలేసిన గద్దర్ వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్నారు.  విప్లవ నేత రాజకీయాల కోసం ఇంతలా దిగజారాలా అని బాధపడుతున్నారు..
    

Tags:    

Similar News