‘మై హోం’పై ఐటీ దాడులు.. అసలు కథ ఏమిటంటే?

Update: 2019-07-05 01:30 GMT
భాగ్య నగరి హైదరాబాద్ లో గురువారం సాయంత్రం రేగిన ఐటీ దాడుల కలకలం వెనుక చాలా కారణాలే ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దాడులకు సంబంధించి భిన్న కథనాలు వినిపిస్తున్నా... అసలు గుట్టు మాత్రం బెంగళూరు గుట్టు లాగేందుకేనన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మై హోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావుకు చెందిన ఇల్లు - కార్యాలయాలపై ఏకంగా వంద మందికి పైగా ఐటీ అధికారులు ఏక కాలంలో దాడులు చేశారు.

గురువారం ఉదయమే ఈ దాడులు మొదలైనా.. సాయంత్రం దాకా అసలు ఈ వార్తనే బయటకు రాలేదు. అయితే సాయంత్రం ఒక్కసారిగా సంచలనం రేపిన ఈ వార్తలతో పెను కలకలమే రేగింది. కేసీఆర్ టార్గెట్ గానే మైహోంలో ఐటీ దాడులు జరిగాయని చాలా మంది అనుకున్నారు. ఇక ఇటీవల అలంద మీడియా పేరిట ఓ కొత్త సంస్థను పెట్టి... దాని చేత టీవీ 9 ఛానెల్ ను కొనేసిన రామేశ్వరరావు.... టీవీ 9 సీఈఓగా ఉన్న రవిప్రకాశ్ ను మెడబట్టి గెంటేసినంత పనిచేశారు కదా. ఈ కసితోనే రవిప్రకాశ్ ఇచ్చిన సమాచారం మేరకే ఐటీ దాడులు జరిగాయని కూడా ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని రవిప్రకాశ్ స్వయంగా వెల్లడించి మరింత కలకలం రేపారనే చెప్పాలి. అయితే ఈ రెండు కారణాలు కూడా అసలు సిసలు కారణాలు కాదని, ఈ దాడుల వెనుక ఎక్కడో కర్ణాటకలో దొరికిన తీగను నిర్ధారించేందుకే ఈ దాడులు జరిగాయని విశ్వసనీయ సమాచారం.

తాజాగా ముగిసిన ఎన్నికలకు ముందు కర్ణాటక రాజధాని బెంగళూరులో ఐటీ ముప్పేట దాడులు చేసింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఆదేశాల మేరకే ఈ దాడులు జరగగా... ఆ దాడులపై కర్ణాటక సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా ఏకంగా బెంగళూరులోని ఐటీ కార్యాలయం ముందు నడిరోడ్డుపై నిరసనకు దిగిన సంగతి తెలిసిందే కదా. ఆ దాడులకు సంబంధించి మైహోం పేరు బయటపడితే... ఆ అవకతవకలను నిర్ధారించుకునేందుకే తాజాగా మైహోంపై ఐటీ దాడులు చేసిందట. బెంగళూరులో దొరికిన పత్రాలతో మైహోంలోని లెక్కలను సరిపోల్చుకునేందుకే ఈ దాడులు జరిగినట్టుగా సమాచారం.
   

Tags:    

Similar News