ఆర్టీసీ ఎపిసోడ్ లో కేసీఆర్ మనసు మార్చింది ఎవరు?

Update: 2019-11-29 04:41 GMT
52 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినా పట్టువీడ లేదు తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. బెట్టును ప్రదర్శించిన ఆయన మనసు ఎందుకు మారింది? ఆర్టీసీ అయిపోయిన స్టోరీ. ఇట్స్ ఓవర్ అంటూ తేల్చేసిన ఆయన.. ఆర్టీసీని బతికించాలన్నదే తన ఆలోచనగా చెప్పి అవాక్కు అయ్యేలా చేశారు. ఈ ప్రెస్ మీట్ కు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆర్టీసీని ప్రైవేటీకరించటం మినహా మరో మార్గం లేదని.. ఆర్టీసీ దేవుడే దిగి వచ్చినా ఆదుకోలేరని తేల్చేసిన కేసీఆర్.. ఎందుకని యూటర్న్ తీసుకున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

52 రోజుల సుదీర్ఘ సమ్మె తర్వాత కార్మికులు ఒక మెట్టు దిగి ఉద్యోగాల్లోకి తిరిగి చేరతామని చెప్పినా ఒప్పుకోలేదు ముఖ్యమంత్రి కేసీఆర్. డిపోల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని మొహరించి.. డ్యూటీలోకి చేరేందుకు వచ్చిన ఉద్యోగుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ మహిళా ఉద్యోగులు పెట్టుకున్న కంటతడి అందరిని అయ్యో అనేలా చేసింది. ఇది జరిగిన రెండు రోజులకు ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ ఆర్టీసీని బతికించాలన్నదే తన కలగా చెప్పటేమ కాదు. వారంతా మంచిగా బతకాలని.. ఆర్టీసీ సంస్థ చల్లగా ఉండాలని చెప్పిన ఆయన సంస్థకు తక్షణ సాయం కింద రూ.100 కోట్లు ఇస్తున్నట్లు తేల్చేవారు.

ఉద్యోగుల్ని వెంటనే విధుల్లో చేరాలన్న ముఖ్యమంత్రి ఆర్టీసీ సంఘాల్ని.. సంఘ నేతల్ని మాత్రం తాము క్షమించమని.. వారిని సంప్రదించమని తేల్చేశారు. విభజించి పాలించు సిద్దాంతాన్ని వంటబట్టించుకున్న ఆయన డిపోకు ఐదుగురు కార్మికులతో సంక్షేమ మండలిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంతలా కేసీఆర్ టోన్ ఎందుకు మారింది? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కార్మికులు సమ్మె చేస్తున్న వేళ.. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయటానికి పెద్ద ఎత్తున మధనం సాగిందని.. అయితే.. ప్రైవేటు ఆపరేటర్లు ఎవరూ రూట్లు తీసుకోవటానికి ముందు రాలేదని చెబుతున్నారు. తెలంగాణ ఆర్టీసీలో అన్నింటికంటే కీలకమైన హైదరాబాద్ మహానగరంలో రూట్లు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదంటున్నారు. నిజానికి ఆర్టీసీ నష్టాల్లో అత్యధికం హైదరాబాద్ మహా నగరం నుంచే ఎక్కువ.

ఆర్టీసీ ప్రైవేటీకరణ తాను అనుకున్నంత ఈజీ కాదని.. దానికి కేంద్రం ఆమోదం అవసరమన్న సాంకేతిక అంశాలు మొదట ముఖ్యమంత్రికి తెలీదని.. తర్వాత అర్థం కావటంతో వెనక్కి తగ్గారని చెబుతున్నారు. తాను ప్రైవేటీకరించినా.. కేంద్రం కొర్రీ పెట్టటం ఖాయమన్న అవగాహనకు వచ్చిన ఆయన తన మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె విషయంలో కేంద్రం నుంచి ఒత్తిడి వచ్చినట్లుగా తెలుస్తోంది. సమ్మెకు ముగింపు పలకాలన్న విషయాన్ని సందేశం రూపంలో పంపారని.. అదే సమయంలో కార్మికులు ఒక అడుగు వెనక్కి వేయటం.. సమ్మె చేయటానికి కారణమైన ఏ అంశాల మీద సానుకూలంగా స్పందించకుండానే ముగింపు పలకటం విశేషంగా చెప్పాలి.


Tags:    

Similar News