కేసీఆర్ ముంద‌స్తు వెనుక 5 అస‌లు కార‌ణాలు!

Update: 2018-09-07 05:54 GMT
ముంద‌స్తుకు కేసీఆర్ ఎందుకు వెళుతున్నాడు?  కోటి రూక‌ల ప్ర‌శ్న ఇది. ఈ ప్ర‌శ్న‌కు ఇప్ప‌టికి మీడియా సంస్థ‌లు బోలెడ‌న్ని విశ్లేష‌ణ‌లు చేసినా.. ఈ మొత్తానికి కార‌ణ‌మైన కేసీఆర్ మాటేమిటి? అన్న‌ది నిన్న‌టి వ‌ర‌కూ ఆస‌క్తిక‌రంగా ఉంది. ఆ పెద్ద మ‌నిషి ఏం చెప్పి ఎన్నిక‌ల‌కు వెళుబోతున్నారు?  తొమ్మిది నెల‌ల అధికారాన్ని వ‌దిలేసి ముంద‌స్తుకు పోనున్న ఆయ‌న ప్ర‌జ‌ల‌కు ఏం చెప్ప‌బోతున్నార‌న్న ఉత్కంట‌కు తెర దించిన ఆయ‌న‌.. సూటి కార‌ణం ఒక్క‌టి కూడా చెప్ప‌లేదు.

దాదాపుగా గంట‌న్న‌ర‌కు పైనే సాగిన ప్రెస్ మీట్లో కేసీఆర్ చెప్పిన విష‌యాల్ని విశ్లేషించి.. ఆయ‌న మాట‌ల్లో చెప్పాలంటే.. రాష్ట్రంలో ఎప్పుడూ లేని భ‌యంక‌ర‌మైన రాజ‌కీయ విష ప్ర‌చారం మొద‌లైంది. అందుకే.. నాకున్న తొమ్మిది నెల‌ల ప‌ద‌వీ కాలాన్ని త్యాగం చేసి మ‌రీ ఎన్నిక‌ల‌కు పోతున్నారు. ఇప్పుడు అభివృద్ధి బ్ర‌హ్మండంగా సాగుతుంది. అందుకే.. ముంద‌స్తుకు వెళ్ల‌టం ద్వారా దాన్ని కొన‌సాగించాల‌న్న కంక‌ణం క‌ట్టుకున్నా అంటూ అత‌క‌ని మాట‌ల్ని చెప్పారు.

కేసీఆర్ ఏం చెప్పినా.. లాజిక్కులు వేసుకోనంత వ‌ర‌కూ బాగానే ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. త‌ర్క‌బ‌ద్ధంగా ఆలోచిస్తే ఆయ‌న మాట‌ల మీద బోలెడ‌న్ని సందేహాలు క‌ల‌గ‌టం ఖాయం. అయితే.. అలాంటి అవ‌కాశం ఇవ్వ‌కుండా త‌న మాట‌ల ప్ర‌భావానికి లోన‌య్యేలా చేసే స‌మ్మోహ‌నం కేసీఆర్ సొంతం. ఈ కార‌ణంతోనే..ముంద‌స్తుకు స‌రైన కార‌ణం చెప్ప‌కుండానే త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డి.. రానున్న రోజుల్లో ఆ తీవ్రంత మ‌రింత ఎక్కువ అవుతుంద‌న్న‌విష‌యాన్ని చెప్పేశారు.

ఇదిలా ఉంటే.. కేసీఆర్ ముంద‌స్తు నిర్ణ‌యం వెనుక ఉన్న అస‌లు కార‌ణాలు ఏమిటి? అన్న‌ది చూసిన‌ప్పుడు ఐదు ముఖ్య‌మైన అంశాలు క‌నిపిస్తాయి.

1. త‌న ప్ర‌భుత్వం మీద నెమ్మ‌దిగా మొద‌లైన అసంతృప్తి

2. త‌న మీద వ‌చ్చే వ్య‌తిరేక‌త వలన కాంగ్రెస్ బ‌ల‌ప‌డ‌కూదన్న ఆలోచ‌న‌

3. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి.. ఆ సానుకూల‌తో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ల‌బ్థి పొంద‌టం

4. కొడుకును సీఎం చేయటం

5. వేస‌వి ఇబ్బందుల్ని అధిగ‌మించ‌టం

ఈ ఐదు కార‌ణాలే కేసీఆర్ ముంద‌స్తు నిర్ణ‌యానికి ప్ర‌ధాన కార‌ణంగా చెప్పాలి.  ఈ అంశాల చుట్టూ తిరిగిన ఆలోచ‌న‌లే కేసీఆర్ ను వ‌చ్చే ఏడాది షెడ్యూల్ ప్రకారం జ‌రిగే ఎన్నిక‌ల‌కు ముందే ప్ర‌జాతీర్పున‌కు పోవాల‌ని డిసైడ్ అయ్యేలా చేసింద‌ని చెప్పాలి. మోడీ మీద ఉన్న వ్య‌తిరేక‌త ఇటీవ‌ల కాలంలో బాగా ఎక్కువైంది. పెద్ద‌నోట్ల ర‌ద్దు మొద‌ట్లో సానుకూలంగా ఉన్న‌ట్లు క‌నిపించినా.. అదంతా కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను ప‌ట్టుకోవటం కాద‌న్న విష‌యం అర్థ‌మైపోయింది.

ఇక‌.. జీఎస్టీతో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది. పెట్రో ధ‌ర‌లు సామాన్యుడి నుంచి సంప‌న్నుడి వ‌ర‌కూ అసంతృప్తికి గురి చేస్తోంది. అవినీతి లేద‌ని చెప్పినా.. అమిత్ షా కొడుకు ఆస్తులు పెర‌గ‌టం.. రాఫెల్ వ్య‌వ‌హారంతో పాటు.. మ‌రికొన్ని అంశాలు కూడా మోడీ స‌ర్కారు మీద మ‌రింత అసంతృప్తిని పెంచేలా చేస్తున్నాయే త‌ప్పించి త‌గ్గించ‌టం లేద‌ని చెప్పాలి.

ఇలాంటివేళ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే.. కేంద్రం మీద ఉన్న అసంతృప్తికి త‌న మీద ఉన్న వ్య‌తిరేక‌త తోడైతే ప్ర‌తికూల ప‌రిణామాలకు అవ‌కాశం ఉంటుంద‌న్న ఆలోచ‌నే కేసీఆర్ చేత ముంద‌స్తుకు న‌డిపించాయ‌ని చెప్పాలి.  మ‌రి ఆయ‌న వ్యూహాల‌కు తెలంగాణ ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పును ఇస్తారో చూడాలి.
Tags:    

Similar News