వాట్ నెక్ట్స్ : నిజాలు తెలిశాక ఏంటి?

Update: 2018-02-12 17:27 GMT
మనం ఒక పని ప్రారంభిస్తున్నాం.. అంటే దానికి సంబంధించి ఏదో ఒక అంచనా ఉంటుంది. ఆ పని ఏ రకంగా ముందుకు సాగి, ఎలాంటి మలుపు వద్ద ఆగుతుందో.. ఆ మలుపు తర్వాత మన ప్రస్థానం ఎలా సాగాలో కూడా మనకు ముందుగానే ఒక అభిప్రాయం ఉంటుంది. ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా.. గాలివాటుగా ఎలా పడితే అలా సాగడం అనేది అంత విజ్ఞత గల పని కాదు. అలాంటి ప్రయత్నం ప్రస్తుతం పవన్ కల్యాణ్ ప్రేరేపించిన జేఎఫ్‌సీ కూడా చేస్తున్నదని అనుమానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆ జేఎఫ్‌సీ లో ఉన్న వాళ్లంతా పెద్దలు.. మేధావులు.. కనీసంగా తమ యాక్షన్ ప్లాన్ ఏమిటో తమకు తెలియకుండా.. అడుగులు వేసేవాళ్లు కాదు. కాకపోతే.. వారి ప్లాన్ గురించి ఇంకా బహిర్గతం చేయకుండా.. దాపరికం పాటిస్తున్నారు.

నిజాలు తెలుసుకున్న తర్వాత... పవన్ కల్యాణ్ ఏం చేయబోతున్నారు అనే విషయంలో ఆయన ఫ్యాన్స్ మరియు రాజకీయంగా పవన్ వైఖరి ఈ రాష్ట్రానికి మేలు చేస్తుందనే ఆశలు పెట్టుకున్న వాళ్లంతా చాలా శ్రద్ధగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రజల్లో రకరకాల సందేహాలు కూడా రేకెత్తుతున్నాయి.

‘తెలియవలసిన నిజాలు’ అంటూ ఏమైనా ఉన్నాయా అనేది పెద్ద బ్రహ్మపదార్థంగా మారింది. ఎందుకంటే.. ఒకరోజు కిందటే ఉండవిల్లి అరుణ్ కుమార్ ఓ విషయంలో స్పష్టత ఇచ్చారు. రెండు రాష్ట ప్రభుత్వాలు కూడా అబద్ధాలు చెబుతున్నాయని తాను అనుకోవడం లేదని - కాకపోతే కొన్ని నిజాలు దాచడం మాత్రం జరుగుతుందని ఆయన చిత్రమైన భాష్యం చెప్పారు. చూడబోతే.. అలా అటు కేంద్రంగానీ.. ఇటు రాష్ట్రంగానీ.. తాము చెబుతున్న మాటల్లో నర్మగర్భంగా దాచిన కొన్ని నిజాలను ఈ జేఎఫ్‌సీ మేధావులు కసరత్తు చేసి బయటకు లాగేలా కనిపిస్తోంది.

అయితే పవన్ కల్యాణ్ పోరాటానికి సిద్ధంగా ఉన్నారా? లేదా మళ్లీ రాష్ట్రమంతా తిరుగుతూ ప్రసంగాలు ఇస్తారా? అనేది మరో అనుమానం. చంద్రబాబు నిజాలు దాచారని ప్రజల్ని మోసం చేశారిన తేలిందే అనుకుందాం. పవన్ ఏం చేస్తారు. ఎలాంటి పోరాటమూ చేయకుండా.. ‘అమ్మా బుజ్జీ’ అంటే చంద్రబాబు లెంపలు వేసుకుని.. తప్పు ఒప్పుకుంటారా? అది సాధ్యమేనా? మరి ఇక్కడ చిన్న ధర్నా - బంద్ చేయాలంటేనే.. ‘ప్రజల జీవితాన్ని ఇబ్బందిపెట్టడం నాకు ఇష్టం లేదు’ అని పవన్ సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు.

కేంద్రం దాచిన నిజాలు తీవ్రమైనవి అని తేలిందే అనుకుందాం. అప్పుడైనా పవన్ ఉద్యమిస్తారా? అక్కడ ఢిల్లీలో కేవలం ధర్నాలకే కేటాయించిన జంతర్ మంతర్ ఉన్నది కదా.. అక్కడ ఆయన దీక్షకు పూనుకుంటారా? దానివల్ల రాష్ట్ర ప్రజల జనజీవితం స్తంభించే పరిస్థితి ఉండదు కదా.. మరి అలాంటి పోరాటాలకు ఆయన సిద్ధమేనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎటూ పోరాడే ఉద్దేశం లేకుండా.. ఇలాంటి కసరత్తు కంచిగరుడ సేవే అవుతుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. పోరుబాట తొక్కకుండా ప్రభుత్వాల్లో కదలిక తేవడం అసాధ్యం అనే సంగతిని పవన్ గుర్తించాలి. నిజాలు తెలుసుకున్న తర్వాత.. తాను ఏం చేయదలచుకున్నాడో కూడా పవన్ స్పష్టత ఇవ్వాలి.
Tags:    

Similar News