అమ‌రావ‌తికి ప‌వ‌న్ రానిది ఇందుకేనా!

Update: 2015-10-24 08:56 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల కోసం త‌న శాయ‌శ‌క్తుల కృషిచేస్తాన‌ని ప‌దే ప‌దే చెప్పే జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అమరావతి శంకుస్థాపనకు ఎందుకు డుమ్మా కొట్టారు? షూటింగ్ లో బిజీ అని చెబుతున్న దాంట్లో నిజం  ఎంత?  షూటింగ్ ఒక్క‌టే కార‌ణం కాకుండా..మ‌రోవైనా కార‌ణాలు కూడా ఉన్నాయా? అనే  ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ రాజకీయ‌వ‌ర్గాల్లో సాగుతోంది.

అమ‌రావ‌తి శంకుస్థాప‌న సంద‌ర్భంగా అంద‌రినీ పేరుపేరునా ఆహ్వానించి కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్యం కావాల‌ని చంద్ర‌బాబు ఆకాంక్షించారు. ఈ క్ర‌మంలో శంకుస్థాపన మహోత్సవానికి రావాల‌ని ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ను ఆహ్వానించారు. పవ‌న్ ప్ర‌స్తుత సినిమా సర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగ్ జ‌రుగుతున్న రామానాయుడు స్టూడియోకు వెళ్లి ఆహ్వానం అంద‌జేశారు. అయితే మ‌రుస‌టి రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు  స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. పొరుగు రాష్ర్టం ముఖ్య‌మంత్రిని స్వ‌యంగా ఆహ్వానించిన చంద్ర‌బాబు పవన్ కళ్యాణ్‌ ను మాత్రం ఆ విధంగా గౌర‌వించ‌లేద‌ని పవన్‌ అభిమానులు అభ్యంత‌రం వ్యక్తం చేశారు. దీంతో సీఎం చంద్రబాబు పవన్‌ కు ఫోన్‌ చేసి మరీ అమరావతికి రమ్మన్నారు. అయిన‌ప్ప‌టికీ  ప‌వ‌న్ రాక‌పోవ‌డం వెన‌క మ‌రో కార‌ణం ఉంద‌ని అంటున్నారు.

రాజధాని భూముల విషయంలో పవన్‌కు- టీడీపీకి మధ్య కోల్డ్‌ వార్‌ నడిచింది. రాజధాని రైతుల పక్షాన పోరాటం కూడా చేస్తానంటూ పవన్‌ ప్రకటించారు. దీనిపై కొంద‌రు టీడీపీ నాయ‌కులు భిన్నంగా స్పందించారు. ఈ నేప‌థ్యంలో తాను పోరాడుతాన‌న్న రైతుల భూముల్లోనే శంకుస్థాప‌న వేడుక జ‌రుగుతుంటే... ఆ కార్య‌క్ర‌మానికి తానెలా హాజ‌రుకావాల‌నే ప‌వ‌న్ ఆగిపోయార‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆహ్వాన పత్రిక అందుకున్న వెంటనే మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను శంకుస్థాపనకు వస్తానో..లేదో అని అప్పుడే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కోసం గుజరాత్‌ లో ఉన్న‌ప్ప‌టికీ వీలు చేసుకొని రావాలంటే ఆయ‌న‌కు పెద్ద విష‌యం కాద‌ని అయితే... వివిధ అభిప్రాయాల నేప‌థ్యంలో ప‌వ‌న్ రాలేద‌ని చెప్తున్నారు.
Tags:    

Similar News