ఆ ప‌ద‌వి కోస‌మే సురేశ్ రెడ్డి కారెక్కాడ‌ట‌!

Update: 2018-09-08 06:14 GMT
కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక నేత మీద మ‌ర‌క‌లు లేకుండా క్లీన్ గా ఉండే నేత‌లు ఎవ‌రైనా ఉన్నారా? అంటే.. చాలా త‌క్కువ మంది క‌నిపిస్తారు. వేళ్ల మీద లెక్క పెట్టగ‌లిగేలా ఉంటారు. అలాంటి వారిలో ఒక‌రు మాజీ స్పీక‌ర్ సురేశ్ రెడ్డి. స‌బ్జెక్ట్ మీద ప‌ట్టుతో పాటు.. స‌గ‌టు కాంగ్రెస్ నేత‌కు భిన్న‌మైన తీరు ఆయ‌న సొంతంగా చెబుతారు.

వైఎస్ హ‌యాంలో స్పీక‌ర్ గా వ్య‌వ‌హ‌రించి.. అంద‌రి ఆద‌రాభిమానాల్ని పొందారు. అప్ప‌ట్లో స్పీక‌ర్ అన్నంత‌నే సురేశ్ రెడ్డి గుర్తుకు రావ‌ట‌మే కాదు.. స‌భాప‌తి కుర్చీకి కొత్త క‌ళ‌ను తెచ్చిన వ్య‌క్తిగా ఆయ‌న్ను పొగిడేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీతో  సుదీర్ఘ అనుబంధం ఉన్న సురేశ్ రెడ్డి తాజాగా పార్టీ ఎందుకు మారిన‌ట్లు?

ప‌దేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న (2009..2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు) ఆయ‌న‌కు ఈసారి గెలుపు ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ లో సీటు ప‌క్కా అన్న మాట‌ను చెబుతారు. మ‌రి.. అలాంటి వేళ గులాబీ కారు ఎక్కాల్సిన అవ‌స‌రం సురేశ్ రెడ్డికి ఏమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌. తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. కేసీఆర్ నుంచి వ‌చ్చిన ఆఫ‌ర్ సురేశ్ రెడ్డిని టెంప్ట్ చేసింద‌ని చెబుతున్నారు. పార్టీలో ఆయ‌న గౌర‌వ మ‌ర్యాద‌ల‌కు భంగం వాటిల్ల‌కుండాచూస్తామ‌న్న హామీతో పాటు.. రానున్న రోజుల్లో రాజ్య‌స‌భ సీటును ఇస్తామ‌న్న హామీకి సురేశ్ రెడ్డి ఫ్లాట్ అయిన‌ట్లుగా తెలుస్తోంది.

వాస్త‌వానికి సురేశ్ రెడ్డి గులాబీ కారు ఎక్కుతార‌న్న స‌మాచారం అందుకొని చివ‌రిక్ష‌ణం వ‌ర‌కూ ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు.. సురేశ్ రెడ్డితో చ‌క్క‌టి సంబంధాలు ఉన్న వారు సైతం ఫోన్లో బుజ్జ‌గించార‌ని.. అయిన‌ప్ప‌టికీ తాను నిర్ణ‌యం తీసుకున్నాన‌ని సున్నితంగా చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో అంశం ఏమంటే.. సురేశ్ రెడ్డి గులాబీ కారు ఎక్క‌టం ఆయ‌న కుటుంబ స‌భ్యుల్లో ఎవ‌రికి ఇష్టం లేద‌న్న మాట‌ను చెబుతున్నారు. అయిన వారిని.. ఇంత‌కాలం తాను మ‌మేక‌మైన పార్టీ నేత‌ల బుజ్జ‌గింపుల్ని కాద‌నుకొని మ‌రీ రాజ్య‌స‌భ ప‌ద‌వి కోసం గులాబీ కారు ఎక్కాల‌న్న ఆలోచ‌న స‌రికాద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ఇంట్లో వారి మాట‌నే విన‌ని సురేశ్ రెడ్డికి టీఆర్ ఎస్‌ లోకి చేరేందుకు త‌గిన కార‌ణాలు.. బ‌య‌ట‌కు చెప్పుకోలేని లెక్క‌లు ఏమున్నాయో?
Tags:    

Similar News