ప‌వ‌న్ డైలామానే టీడీపీ నేతల కామెడీకీ కారణమా?

Update: 2017-10-06 15:30 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ దారెటు? క‌్రియాశీల రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించి ఆ వేడిలో స‌భ‌లు కూడా నిర్వ‌హించి - పార్టీ శ్రేణుల‌ను కూడా ఎంపిక చేసిన‌ ప‌వ‌న్ దీనికి తోడుగా పుస్త‌కం రాయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ సంగ‌తి అలా ఉంచితే...అక్టోబ‌ర్ నుంచి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి అని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ త‌దుప‌రి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. దీంతో ప‌వ‌న్ ఎంట్రీ ఎప్పుడో తెలియక అందరూ అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇటు ప‌వ‌న్‌ కు - అటు ఆయ‌న అభిమానుల‌కు జ‌న‌సేన పార్టీ ప‌య‌నంపై పూర్తి స్ప‌ష్ట‌త లేనందునే...మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ నేత‌లు సెటైర్లు వేస్తున్నార‌ని అంటున్నారు. గ‌తంలో కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు ప‌వ‌న్ ఎవ‌రో తెలియ‌దు అని వ్యాఖ్యానించ‌డం, తాజ‌తా రాష్ట్ర మంత్రి పితాని స‌త్యానార‌య‌ణ ప‌వ‌న్ గురించి ఆలోచించేంత టైం లేద‌ని లైట్ తీసుకోవ‌డం వెనుక కార‌ణం ఇదేనంటున్నారు.

గడచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ - తెలుగుదేశం పార్టీలకు మద్దతుగా పవన్ కూడా ఎన్నికల ప్రచారం చేశారు. పవన్ వల్ల కోస్తా - రాయలసీమ ప్రాంతాల్లో ఆ రెండు పార్టీలు లాభపడ్డాయన్నది కాద‌న‌లేని విషయం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా కాపులు దాదాపు ఏకపక్షంగా టీడీపీకి ఓట్లు వేయ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగా ప‌లువురు చెప్తారు. ఈ ఓట్ల తోనే ఉభయగోదావరి జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లో కూడా టీడీపీ అభ్యర్ధులు పలువురు విజయం సాధించారు. దాంతో పవన్ వల్ల టీడీపీనే బాగా లాభపడిందనే ప్రచారం జ‌రిగింది. అయితే, ఎన్నికలైన దగ్గర నుండి పవన్ రాజకీయ ముఖచిత్రంపై పెద్దగా కనబడలేదు. దాంతో అందరూ పవన్ మరచిపోయారు. ఇంతలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు రాజధాని నిర్మాణాన్ని తలకెత్తుకుని రాజధానిగా గుంటూరు జిల్లాలోని అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేశారు. వెంటనే అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాలపై ప్రభుత్వం దృష్టి పెట్టటం - రైతుల భూములను రాజధాని నిర్మాణం పేరుతో సమీకరించటంతో అలజడి మొదలైంది. దాంతో ఒక్కసారి భూములు ఇవ్వటం ఇష్టంలేని రైతులకు మద్దతుగా పవన్ ఒకసారి రాజధాని గ్రామాల్లో పర్యటించారు. బలవంతంగా రైతుల భూములను లాక్కోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతే మళ్ళీ కనబడలేదు.

అయితే, ప్రభుత్వం మాత్రం తన పనిని తాను చేసుకునిపోతూనే ఉంది. అయినా రాజధాని భూములపై పవన్ మళ్ళీ స్పందించలేదు. ఇదే అంశంపై ఒకసారి మీడియా సమావేశం నిర్వహించినా ఎవరికీ అర్ధంకాని రీతిలో మాట్లాడేసి పంజరంలో చిలుకలాగ వెళ్ళిపోయారు. మళ్ళీ చాలాకాలానికి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తన గళం వినిపించారు. రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేకహోదా బదులు ప్రత్యేకప్యాకేజి ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగినపుడు ఒకసారి ప్రత్యేకహోదాకే తన మద్దత అని ప్రకటించారు. తిరుపతిలో బహిరంగసభ పెట్టి ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తానంటూ ప్రకటించారు. అనంత‌రం కాకినాడలో ప్రత్యేకహోదా కోసం మళ్ళీ ఇంకో బహిరంగసభ పెట్టారు. రెండు సభల్లో కూడా రాష్ట్రంలోని విపక్షాలు ఏమి చేయాలో చెప్పారు, టీడీపీ ఎంపీలపై విమర్శ లు చేసారే కానీ ప్రత్యేకహోదా కోసం కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేని ముఖ్య మంత్రి చంద్రబాబునాయడు గురించి మాత్రం ఏమీ మాట్లాడలేదు. మొదటి నుండి కూడా పవన్ ప్రసంగాలు ఒక దిశ, దశలేకుండా సాగుతున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడే పవన్ రాజకీయాల్లో పూర్తిస్ధాయిలో కొనసాగే విషయంలో చిత్తశుద్ధిని, నిలకడపై చర్చ సాగుతోంది.

ఈ నేపథ్యంలోనే గతంలో పవన్ సోదరుడు - కాంగ్రెస్ నేత చిరంజీవి పోషించిన పాత్రను అందరూ మననం చేసుకుంటున్నారు. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి కూడా రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశంతో ప్రజారాజ్యంను స్ధాపించారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకి రాష్ట్రం లో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. చిరంజీవి దెబ్బకు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశంపార్టీ వణికిపోయింది. అందరూ చిరంజీవి ముఖ్యమంత్రి అయిపోవటం ఖాయమనే అనుకున్నారు. తీరా ఎన్నికలైన తర్వాత చూస్తే, కాంగ్రెస్ పార్టీనే తిరిగి అధికారంలోకి రాగా, ప్రజారాజ్యానికి 18 సీట్లు మాత్రం వచ్చింది. ప్రజారాజ్యానికి అనుబంధంగా యువరాజ్యం విభాగాన్ని పెట్టి అప్పట్లో పవన్‌కల్యాణ్ బాగానే హడావుడి చేయటం అందరికీ తెలిసిందే. ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న చంద్రబాబు ఆశలపై చిరంజీవి పెద్ద ఎత్తున గండికొట్టారు. పార్టీ ఆరంభం మాత్రం బ్రహ్మాండంగా జరిగినా తర్వాత జరిగిన పరిణామాల్లో చిరంజీవి నిలదొక్కుకోలేకపోయారు. ఒక వ్యూహం, దిశ, దశా కొరవడటంతోనే చిరంజీవి విఫలమయ్యారని ఇప్పటికీ ప్రజలు అనుకుంటుంటారు. ప్రస్తుత పరిస్ధితుల్లో అధికార టీడీపీ, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ చాలా బలంగా కనిపిస్తున్నాయి. పైగా కాంగ్రెస్, వామపక్షాల బలం దాదాపు అడుగంటిపోయింది. ఈ నేపధ్యంలో పవన్ జనసేన తరపున చురుగ్గా ఉండటం పట్ల పలువురు ఆస‌క్తి చూపుతున్నారు. అయితిఏ అన్నలాగే తమ్ముడు కూడా రాజకీయంగా దెబ్బతింటారా ? లేక చక్రం తిప్పుతారా అనే విషయం ఇపుడు హాట్ టాపిక్ అయింది. భవిష్యత్తులో పవన్ భాజపాతో పొత్తు పెట్టుకునే అనుమానమే. మరి అధికార పార్టీని కాదని వైసీపితో కలుస్తారా? లేక తను అభిమానించే వామపక్షాలతో కలిసి కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేస్తారా? ఇదేమీ కాదని టీడీపీతోనే పొత్తు పెట్టుకుంటారా ? అన్న విషయాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దాంతో పవన్ జెండా - అజెండాలు ఏ విధంగా ఉంటాయన్న విషయంలో స్పష్టత రావాలని కోరుకుంటున్నారు. ఆ స్ప‌ష్ట‌త కొర‌వ‌డింది కాబ‌ట్టే ప‌వ‌న్ న‌వ్వుల పాల‌య్యాడ‌ని అంటున్నారు.
Tags:    

Similar News