మోగనున్న రె 'బెల్స్'....

Update: 2018-11-04 15:30 GMT
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అన్నీ రాజకీయ పార్టీలను రెబెల్స్ బెడద పీడిస్తోంది. ఎన్నికలకు నెలరోజులే గడువుండడంతో తెలంగాణలో అన్నీ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే తిరుగుబాటు అభ్యర్దుల నుంచి ఎలా బయట పడలో మాత్రం తెలియడం లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో రె"బెల్స్" పార్టీలో దడ పుట్టిస్తున్నారు. ముందస్తు ఎన్నికల ప్రకటనతో పాటు 105 మంది అభ్యర్దులను కూడా ప్రకటించి తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహాత్మకంగా వ్యవహరించాను అనుకుంది. అయితే టిక్కెట్టు రానివారు మాత్రం అనూహ్యంగా పార్టీకి ఎదురు తిరుగుతున్నారు. అభ్యర్దులను ప్రకటించి నెలరోజులు దాటిన అసమ్మతి మాత్రం పోవడంలేదు. బాబుమోహన్ లాంటి సట్టింగ్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలలో చేరి టిక్కెట్లు కూడా తెచ్చుకున్నారు. మంత్రులు కె. తారక రామారావు - హరీష్‌ రావు - ఈటల రాజేందర్ వంటి వారు ఎంత బుజ్జగించినా అసమ్మతి మాత్రం తొలిగిపోవటం లేదు. 119 స్దానాలున్న తెలంగాణలో కనీసం 30 స్దానాలలో తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా రెబెల్స్ పోటి చేసే అవకాశం ఉందంటున్నారు.

ఇక ఇప్పటి వరకూ అభ్యర్దులు ప్రకటించని మహాకూటమిలో కూడా రెబెల్స్ మోతాదు ఎక్కువగా  ఉండే అవకాశం ఉందంటున్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని గ్రహించిన కాంగ్రెస్ - తెలుగుదేశం నాయకులు రెండెళ్ల క్రితమే తమ తమ నియోజకవర్గాలలో పనిచేయడం ప్రారంభించారు. టిక్కెట్లు తమకు ఖాయమని ప్రచారం కూడా చేసుకున్నారు. ఈ దశలో మహాకూటమి పేరుతో టిక్కెట్లు రాకపోతే తమ పరిస్థితి ఏమిటని బెంబేలు చెందుతున్నారు. వీరంతా టిక్కెట్టు రాకపోతే రెబెల్స్‌ గా పోటి చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి నల్గొండ - వరంగల్ - కరీంనగర్ జిల్లాలలో ఈ రెబెల్స్ బెడద ఉంటుందంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి రంగారెడ్డి - మహబూబ్‌ నగర్ - మెదక్ - ఖమ్మం జిల్లాలలో రెబెల్స్ బెడద ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఈ రెబెల్స్ బెడదను ముందుగానే పసిగట్టడం వల్లే అభ్యర్దుల ప్రకటనను మహాకూటమి వాయిదా వేస్తున్నట్లు చెబుతున్నారు. ముందుగానే టిక్కెట్టు రానివారిని బుజ్జగించాలన్నది మహాకూటమి నేతల ఆలోచనగా చెబుతున్నారు. మరీ పట్టుమీద ఉన్న నాయకులతో కుంతియ వంటి అగ్రనాయకుల చేత మాట్లాడించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ కూడా తమ అధినేత చంద్రబాబు నాయుడు చేత టిక్కెట్టు రానివారి తో మాట్లాడించాలని భావిస్తున్నారు. అసంత్రుప్తులు - రెబెల్స్‌తో అన్నీ పార్టీలకు చుక్కుల కనిపించడం ఖయంగా ఉంది. 


Tags:    

Similar News