అన్ని పార్టీల్లో సిగ‌ప‌ట్లు..అస‌మ్మ‌తి కుంపట్లు

Update: 2018-11-16 04:44 GMT
తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయం కాక‌మీద‌కు చేరింది. నామినేష‌న్ల దాఖ‌లు మొద‌ల‌వ‌డం - ఆయా పార్టీలు టికెట్ల కేటాయింపుతో అన్ని పార్టీల్లోనూ నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి కుంపట్లు రాజుకుంటున్నాయి. అసమ్మతి సెగలతో నేతలు రగిలిపోతున్న నేత‌లు అప్ప‌టివ‌ర‌కు అభిమానించిన పార్టీపై - అగ్ర‌నేత‌ల తీరుపై మండిప‌డుతున్నారు.  ఒక్కోపార్టీలో ఒక్కో ర‌కంగా త‌మ త‌మ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ సీటును ఆశిస్తున్న హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక్‌ రెడ్డి గురువారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసం ముందు ధర్నాకు దిగారు.శంషాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్తీక్‌ రెడ్డి అనుచరులతో కలిసి హంగామా చేశారు. పార్టీ జెండా దిమ్మెను ధ్వంసం చేసి... అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేశారు. కార్యాలయం దగ్గర కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు.

మ‌హా కూట‌మి పేరుతో విప‌క్షాల‌ను ఒక్క‌తాటి పైకి తెచ్చి టీఆర్ ఎస్‌ ను గ‌ద్దె దించాల‌ని క‌ల‌లు కంటున్న కాంగ్రెస్ పార్టీ....త‌న అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల‌తో బ‌జారున ప‌డుతోంది. కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ పైనే ఆ పార్టీలోని ఆశావహులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం సీటు కోసం భక్తచరణ్‌ దాస్ రూ. 3 కోట్లు డిమాండ్ చేశారని కాంగ్రెస్ నేత క్యామ మల్లేష్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆడియో టేపుల‌ను కూడా ఆయ‌న బ‌య‌ట‌పెట్టారు. కుతంత్రపు బుద్ధితో కుర్మ - యాదవులను విస్మరించి సీట్లు పంచుకుంటున్నారని విమర్శించారాయన. రాహుల్ గాంధీ ఆశయాలకు విరుద్ధంగా నేతలు పనిచేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ కంటే టీఆర్ ఎస్ పార్టీయే సీట్ల పంప‌కంలో ఉత్త‌మంగా వ్య‌వ‌హ‌రించింద‌ని అన్నారు. మ‌రోవైపు వివిధ చోట్ల అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారింది. వరంగల్ జిల్లాలో డీసీసీ ప్రెసిడెంట్‌ గా పనిచేసిన నాయిని రాజేందర్‌ రెడ్డి... రెబల్‌ గా పోటీ చేస్తానంటూ ప్రచారం ప్రారంభించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భిక్షపతి యాదవ్ కూడా రెబల్‌ గా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. మేడ్చల్ నియోజకవర్గంలో జంగయ్య యాదవ్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖైరతాబాద్ సీటు ఆశీస్తున్న రోహిన్‌ రెడ్డి... తన అనుచరులతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు.

మ‌రోవైపు తెలుగుదేశం పార్టీ టికెట్ల పంచాయితీ అమరావతికి చేరింది. పొత్తులో కేటాయించిన సీట్లు సరిగ్గా లేవని - అభ్యర్థుల ఎంపిక కూడా పారదర్శకంగా లేదని పలువురు టీడీపీ నాయకులు - కార్యకర్తలు గత రెండ్రోజులుగా ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్ కేంద్రంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ.. శేరిలింగంపల్లి సీటును రూ.5 కోట్లకు అమ్ముకొన్నారని మువ్వా వర్గీయులు ఆరోపిస్తే - రమణ కారణంగానే తనకు అన్యాయం జరిగిందని సామ రంగారెడ్డి మండిపడుతున్నారు. తాను ఎల్బీనగర్ నుంచి పోటీకి ఏర్పాట్లుచేసుకుంటే.. ఇబ్రహీంపట్నం కేటాయించడమేమిటని నిలదీస్తున్నారు.
Tags:    

Similar News