టికెట్ కావాల్సిందే..టీఆర్ ఎస్ లో ముదిరిన లొల్లి

Update: 2018-09-16 06:44 GMT
తెలంగాణ రాష్ట్ర సమితిలో అసమ్మతి సెగ అంటుకుంది. పలు నియోజకవర్గాల్లో ఉద్యమకారులకు కాకుండా బయటకు నుంచి వచ్చిన వారికి - సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వడంపై నిరసన వ్యక్తమవుతోంది. తాము ఉద్యమంలో పనిచేశామని.. ఉద్యమాన్ని నీరుగార్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తారని టీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఆందోళనలు - ర్యాలీలు - నిరసనలు తెలుపుతున్నాయి. అంతేకాదు రెబల్ గా పోటీచేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో టీఆర్ ఎస్ లో ఆందోళన మొదలైంది.

*స్టేషన్ ఘన్ పూర్ లో కడియం x రాజయ్య

వరంగల్ పూర్వపు జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. ఇక్కడ తాజా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి - సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రాజయ్యకు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కడియం శ్రీహరి వర్గీయులు హన్మకొండకు తరలివెళ్లారు. కడియం ను కలిసి పోటీచేయాలని కోరారు. కడియం కూతురు కావ్యను అయినా దించాలని కోరారు. అవినీతిపరుడైన రాజయ్యకు టికెట్ సహించమని.. అభ్యర్థి మార్చాలని శ్రీహరిని కోరారు. కడియం మాట్లాడూ కేసీఆర్ దృష్టికి ప్రజల ఆవేదనను తీసుకెళ్తామని.. పార్టీ కోసం కలిసి పనిచేయాలని సముదాయించారు.

*పాలకుర్తిలో ఎర్రబెల్లి x రవీందర్ రావు

వరంగల్ జిల్లా టీఆర్ ఎస్ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్ రావు తిరుగు బావుటా ఎగురవేశారు. పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పులలో తెలంగాణ ఉద్యమకారులు ఏర్పాటు చేసిన సమావేశం పాల్గొని నియోజకవర్గంలో ఎర్రబెల్లికి వ్యతిరేకంగా పోటీచేస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యే టికెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని.. ఉద్యమంలో పాల్గొనని ఎర్రబెల్లికి టికెట్ ఇవ్వడం దారుణమన్నారు. నియోజకవర్గంలో టీఆర్ ఎస్ ను కాపాడేందుకు బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు.

*వరంగల్ తూర్పులో కొండా సురేఖకే మద్దతు

కొండా సురేఖ తనకు టీఆర్ ఎస్ టికెట్ రాకపోవడంపై తిరుగుబావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే.. అయితే వరంగల్ తూర్పులోని టీఆర్ ఎస్ శ్రేణులు మాత్రం తమ మద్దతు కొండా సురేఖకే అని స్పష్టం చేస్తున్నారట.. కేసీఆర్ - హరీష్ రావు తర్వాత సర్వేలో అత్యధికంగా ప్రజాధరణ ఉన్న మూడో ఎమ్మెల్యేగా కొండా సురేఖే పేరే వచ్చిందని ఆమెకు టికెట్ ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారట.. తెలంగాణ కోసం అమరులైన 100 మంది కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున కొండా సురేఖ సాయం చేసి ఆదుకుందని.. ఆమెకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సురేఖ అంటే గిట్టని వారు.. సహించని వారు తప్పుడు సమాచారం ఇచ్చి టికెట్ రాకుండా చేశారని మండిపడుతున్నారు.  సురేఖకు కేసీఆర్ టికెట్ ఇవ్వాలని.. లేదంటే కొండా దంపతులతోనే కలిసి నడుస్తామని టీఆర్ ఎస్ అధిష్టానానికి షాక్ ఇస్తున్నారట..

*భూపాలపల్లిలో స్పీకర్ కు సెగ

భూపాలపల్లి నియోజకవర్గంలో స్పీకర్ మధుసూదనచారికి పోటీ నెలకొంది. అక్కడ టికెట్ ఆశిస్తున్న మరో టీఆర్ ఎస్ నేత గండ్ర సత్యనారాయణ నియోజకవర్గంలో ర్యాలీలు తీస్తు తాను రెబల్ గా పోటీచేస్తానని తేల్చిచెపుతున్నాడు. టీఆర్ ఎస్ తనకు సీటు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నాడు.  దీంతో స్పీకర్ చారి ఆందోళనగా ఉన్నారు.

ఇక వేములవాడలో సిట్టింగ్ తాజా ఎమ్మెల్యే రమేష్ బాబుపై నిరసన సెగ అంటుకుంది. కరీంనగర్ జడ్పీ చైర్మన్ తుల ఉమ వేములవాడ టికెట్ కావాలంటూ అనుచరులతో కలిసి నిరసనలు తెలుపుతున్నారు.

ఇక ఆలేరు నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీతను మార్చాలని నియోజకవర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు. భువనగిరిలో చింతల వెంకటేశ్వర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. నారాయణ్ ఖేడ్ లో భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నేతలు సమావేశమయ్యారు. ఖానాపూర్ లో టికెట్ ఆశించిన రమేష్ రాథోడ్ అక్కడా టీఆర్ ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ పై పోటీకి సిద్ధమవుతున్నారు. పాత మహబూబ్ నగర్ లోనూ టిఆర్ ఎస్ రెబల్స్ బరిలో ఉంటామని స్పష్టం చేస్తున్నారు. 

దీంతో టీఆర్ ఎస్ అసంతృప్తులను బుజ్జగించేందుకు కేటీఆర్ రంగంలోకి దిగారు. ఉమ్మడి మహబూబ్ నగర్ నియోజకవర్గ నేతల అసంతృప్తులో మాట్లాడారు. వినని వారిని కేసీఆర్ తో కలిపిస్తున్నారు. నేతల మధ్య సయోధ్య కుదిర్చే పని చేస్తున్నారు.
Tags:    

Similar News