చరిత్రలో తొలిసారి నలుగురు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియాతో మాట్లాడారు. అదే రీతిలో సంచలన కామెంట్లు చేశారు.జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఇంట్లో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆయనతోపాటు జస్టిస్ రంజన్ గొగోయ్ - జస్టిస్ మదన్ బీ లోకూర్ - జస్టిస్ కురియన్ జోసెఫ్ మీడియాతో మాట్లాడారు. హైకోర్టులు - సుప్రీంకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలపై ప్రభుత్వం - న్యాయవ్యవస్థ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సందర్భంలో న్యాయమూర్తులు తొలిసారి మీడియాతో మాట్లాడనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భారత ప్రధాన న్యాయమూర్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సీజేఐపై అభిశంసన అన్నది ఇక దేశ ప్రజల చేతుల్లోనే ఉన్నదని జస్టిస్ చలమేశ్వర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో పాలన సరిగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. కొన్ని నెలలుగా సుప్రీంకోర్టులో ఎన్నో జరగకూడని సంఘటనలు జరిగిపోయాయని చెప్పారు. ఇదే విషయాన్ని తాము సీజేఐకి చెప్పినా ఆయన వినిపించుకోలేదని అన్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా తొలిసారి మీడియాతో మాట్లాడాల్సి వస్తున్నదని ఆయన స్పష్టంచేశారు. దేశం ముందు తమ ఆందోళనలను ఉంచాలన్న ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చినట్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం మనుగడ సాధించడం అసాధ్యమని చలమేశ్వర్ అనడం గమనార్హం.
అయితే ఏ అంశంలో సీజేఐతో విభేదాలు వచ్చాయన్న విషయాన్ని మాత్రం చలమేశ్వర్ స్పష్టంగా చెప్పలేదు. `సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తంచేస్తూ రెండు నెలల కిందట సీజేఐకి మేం నలుగురం లేఖ రాశాం. కొన్ని విషయాలు ఇలాగే జరగాలని అందులో కోరాము. కానీ అవి ఎలా జరగకూడదో అలాగే జరిగాయి. ఇది సుప్రీంకోర్టు సమగ్రతపై అనుమానాలకు తావిస్తున్నది` అని చలమేశ్వర్ అన్నారు. జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్, జస్టిస్ రంజన్ గొగొయ్ లతో కలిసి చలమేశ్వర్ మీడియాతో మాట్లాడారు.
కాగా, సీజేఐకి ఈ సందర్భంగా లేఖ రాశారు. `కొంతకాలంగా సుప్రీంకోర్టు జారీ చేసిన కొన్ని ఆదేశాలు న్యాయవ్యవస్థ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపడంతోపాటు హైకోర్టుల స్వతంత్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అంతేకాదు చీఫ్ జస్టిస్ కార్యాలయ పాలనపైనా ప్రభావం చూపిస్తాయి. ఇది ఎంతో ఆందోళనకర పరిణామం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే మిగతా న్యాయమూర్తుల్లో తొలివాడు తప్ప అంతకుమించి ఎక్కువా కాదు తక్కువా కాదు. చీఫ్ జస్టిస్ గా మీరు కోరుకున్న బెంచ్ లకే కొన్ని కీలకమైన కేసులను ప్రత్యేకంగా కేటాయించడం సరైనది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆగాల్సిందే. దేశం ముందు సుప్రీంకోర్టుకు తలవంపులు రాకూడదన్న ఉద్దేశంతోనే ఈ విషయాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పటికే ఇలాంటి ఘటనల వల్ల కొంత నష్టం జరిగింది.` అని పేర్కొన్నారు.
ఇదిలాఉండగా...సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీనిపై విలేకరుల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.