క్యాబ్‌ డ్రైవ‌ర్‌ గా ముఖేశ్ అంబానీ!

Update: 2017-02-25 07:56 GMT
రిల‌య‌న్స్ జియోతో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ... నిన్న‌టిదాకా మొబైల్ నెట్‌వ‌ర్కింగ్‌లో టాప‌ర్‌గా ఉన్న ఎయిర్‌ టెల్‌ ను భారీ దెబ్బే కొట్టారు. జియో దెబ్బ‌కు ఒక్క ఎయిర్ టెల్లే కాదండోయ్‌... ఈ రంగంలోని అన్ని కంపెనీలు కూడా గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాయి. ఈ త‌ర‌హా ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్న వాటిలో ప్ర‌భుత్వ రంగంలోని బీఎస్ఎన్ఎల్ కూడా మిన‌హాయింపేమీ కాదు. సెల్యూలార్ ఇండ‌స్ట్రీని ఒక్క దెబ్బ‌తో షేక్ చేసేసిన ముఖేశ్‌... తాజాగా మ‌రో కీల‌క రంగంపై క‌న్నేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

 ప్ర‌స్తుతం దేశంలో క్యాబ్ స‌ర్వీసుల రంగం శ‌ర‌వేగంగా పెరుగుతోంది. ఈ రంగంలో దేశీయ కంపెనీల‌తో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మెరుగైన ప‌నితీరు క‌న‌బ‌రుస్తున్నఉబెర్ కూడా ఉంది. ఎన్ని ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నా... ఉబెర్ త‌న‌దైన శైలి దూకుడుతో ఈ రంగంలో రాణిస్తోంది. అయితే సింగిల్ దెబ్బ‌కు ఎయిర్ టెల్ స‌హా మిగిలిన సెల్యూలార్ ఆప‌రేట‌ర్ల‌కు చుక్క‌లు చూపిన ముఖేశ్ త‌ల‌చుకుంటే... ఉబెర్ కూడా తొక ముడ‌క త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌ ను రిల‌య‌న్స్ జియో పేరిట‌ సెల్యూల‌ర్ ఆప‌రేట‌ర్ అవ‌తారం ఎత్తించిన ముఖేశ్ అంబానీ.. జియో క్యాబ్స్ పేరిట త‌న కంపెనీని ట్యాక్సీల రంగంలోకి దించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే రిల‌య‌న్స్ ప్ర‌తినిధులు ఈ రంగంపై లోతైన ప‌రిశోధ‌న మొద‌లుపెట్టేశార‌ట‌. అంతేకాదండోయ్‌... ఇప్ప‌టికే 600 కార్ల కొనుగోళ్ల కోసం రిల‌య‌న్స్ ఇప్ప‌టికే ఆర్డ‌ర్లు ఇచ్చేసింద‌ట‌.

ఈ ఏడాది ముగిసేలోగానే జియో క్యాబ్స్‌ను రంగంలోకి దించేందుకు ముఖేశ్ ప‌క్కా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ముందుగా బెంగ‌ళూరు, చెన్నై...  త‌ర్వాత ద‌శ‌లో డిల్లీ, ముంబై న‌గ‌రాల్లోనూ జియో క్యాబ్స్ అందుబాటులోకి రానున్న‌ట్లు స‌మాచారం. మార్కెట్ నిపుణుల అంచ‌నా ప్ర‌కారం... ఈ ఏడాది ఏప్రిల్- జూలై మ‌ధ్య‌లోనే రిల‌య‌న్స్ నుంచి ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంద‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. సెల్యూల‌ర్ ఆప‌రేట‌ర్‌గా ఆ రంగంలో పెను సంచ‌ల‌నం రేపిన ముఖేశ్... ఇక క్యాబ్ డ్రైవ‌ర్ ఏ మేర ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News