పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు!

Update: 2023-01-02 07:24 GMT
పెద్ద నోట్ల రద్దు చేస్తూ 2016లో నాటి మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై   సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెద్ద నోట్ల రద్దును సుప్రీంకోర్టు సమర్థించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వ చర్యలను సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. ఈ కేసును విచారించిన జస్టిస్‌ ఎన్‌.ఎ.నజీర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పెద్ద నోట్ల రద్దుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మొత్తం ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు సభ్యులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్‌ 8 కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ చెల్లుబాటు అవుతుందని ధర్మాసనం వెల్లడించింది.

పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన 58 పిటిషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ నిర్ణయానికి సంబంధించిన రికార్డులను అందజేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐలను గత డిసెంబరు 7న ఆదేశించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితం ఆధారంగా నోట్ల రద్దు నిర్ణయాన్ని కొట్టివేయలేమని న్యాయస్థానం పేర్కొంది. నోట్ల రద్దు నిర్ణయం వెనుక మూడు లక్ష్యాలను గుర్తించినట్లు పేర్కొంది. దీంతోపాటు ఆ లక్ష్యాలను చేరుకోవడంలో కొన్ని తేడాలు ఉన్నాయని ఆపేక్షించింది. అయితే వాటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టిపారేయలేమని స్పష్టం చేసింది.

కాగా నోట్ల రద్దు అంశాన్ని విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోని జస్టిస్‌ గవాయ్‌ ఈ అంశాన్ని సమర్థించారు. పెద్దనోట్ల రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా లేదని తెలిపారు. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య సంప్రదింపుల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని జస్టిస్‌ గవాయ్‌ సమర్థించారు.

కాగా నోట్ల రద్దు విషయంలో కేంద్రం వైఖరిని మరో న్యాయమూర్తి జస్టిస్‌ నాగరత్న తప్పుపట్టారు. ప్రభుత్వం కేవలం గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా కాకుండా ప్లీనరీ చట్టం రూపంలో నిర్ణయం వెలువరించాల్సిందని అభిప్రాయపడ్డారు.

కేంద్రం అన్ని రకాలుగా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకుందని జస్టిస్‌ నాగరత్న అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బ్లాక్‌ మనీని అరికట్టడం, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడం, దొంగనోట్లను నియత్రించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దును తెచ్చారని అభిప్రాయపడ్డారు.

కానీ, ఆ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకోకుండా.. పూర్తిగా చట్టవిరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు అంశాన్ని చేపట్టిందని జస్టిస్‌ నాగరత్న అభ్యంతరం వ్యక్తం చేశారు.. 2016లో వెలువడిన నోటిఫికేషన్‌ పై ఇప్పుడు ఎటువంటి స్టే ఇవ్వలేమని స్పష్టం చేశారు. న్యాయస్థానం జరగబోయే వాటిపైన చర్యలు తీసుకోగలదని స్పష్టం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News