జేసీ బ్ర‌ద‌ర్స్‌ను బాబు ప‌క్క‌న పెట్టేశారోచ్ ?

Update: 2021-09-16 14:30 GMT
అనంతపురం జిల్లా రాజకీయలు వేడెక్కాయి. మాజీ ఎంపీ, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల‌ను ఉద్దేశించి, తాడిప‌త్రి మునిసిప‌ల్ చైర్మ‌న్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో జిల్లా పార్టీ నేత‌లు అంద‌రూ ఒక్క‌ట‌వుతున్నారు. ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ కాల్వ‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. మ‌రోవైపు గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి జేసీ బ్ర‌ద‌ర్స్ ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీ వ్యాఖ్య‌ల‌తో పార్టీని ఇబ్బంది పెడుతూ వ‌స్తున్నారు. దీనికి తోడు ఇటీవ‌ల జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌లో రాష్ట్రం మొత్తం మీద టీడీపీ గెలిచిన ఏకైక మున్సిపాల్టీగా తాడిప‌త్రి రికార్డుల‌కు ఎక్కింది. ఇది సంచ‌ల‌న‌మే. ఈ క్రెడిట్ అంతా జేసీ బ్ర‌ద‌ర్స్ ఖాతాలోకి వెళ్లిపోయింది. అనంత‌రం జేసీ ప్ర‌భాక‌ర్ త‌న గెలుపు వెన‌క జ‌గ‌న్ ఉన్నారంటూ బాంబు పేల్చారు. ఇది కూడా పార్టీకి మైన‌స్ అయ్యింది.

జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ పార్టీని బ‌తికించాలంటే చంద్ర‌బాబు చాలా మార్పులు , చేర్పులు చేయాల‌ని కూడా జేసీ ప‌దే ప‌దే బెదిరింపు ధోర‌ణితో మాట్లాడుతూ వ‌స్తున్నారు. చంద్ర‌బాబు సైతం జేసీ బ్ర‌ద‌ర్స్‌ను ఏమీ అన‌కుండా చేష్ట‌లుడిగి చూస్తూ వ‌స్తున్నారు. అయితే తాజా సంఘ‌ట‌న‌తో జేసీ బ్ర‌ద‌ర్స్‌ను బాబు ప‌క్క‌న పెట్టిన‌ట్టే క‌నిపిస్తోంది. తాజాగా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు క‌మిటీలు నియ‌మిస్తోంది. పార్టీ ప‌ద‌వుల‌ను శ‌ర‌వేగంగా భ‌ర్తీ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అనంతపురం పార్లమెంటరీ కమిటీలో జేసీ వర్గానికి అధిష్టానం చోటు ఇవ్వక‌పోవ‌డం వారికి పెద్ద షాకే అయ్యింది.

అనంత‌పురం పార్ల‌మెంట‌రీ జిల్లా పార్టీ క‌మిటీలో మొత్తం నలభై మందిని నియమిస్తే అందులో తాడిపత్రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి మొత్తం ఐదుగురికి చోటు క‌ల్పించారు. వీరంతా కూడా తెలుగుదేశం పార్టీని న‌మ్ముకుని ఏళ్ల‌కు ఏళ్లుగా ప‌ని చేస్తోన్న వారే. వీరి నియామకంలో కూడా అధిష్టానం జేసీ బ్ర‌ద‌ర్స్‌తో సంబంధం లేకుండా చేసిన‌ట్టు తెలుస్తోంది. రాయలసీమ టీడీపీ నేతల సదస్సులో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చంద్ర‌బాబుకు తీవ్ర ఆగ్ర‌హం తెప్పించాయ‌ని టాక్ ? అందుకే బాబు వాళ్లను కంట్రోల్ చేయాల‌ని వారిని ఏ మాత్రం ప‌ట్టించుకోలేద‌ని అంటున్నారు.

జేసీ సోద‌రులు అనంత‌పురం జిల్లా పెత్త‌నం అంతా త‌మకే ఇవ్వాల‌ని.. తాము చెప్పిన‌వాళ్ల‌కే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లు ఇవ్వాల‌ని చంద్ర‌బాబుకే హుకూం జారీ చేసుకుంటూ వ‌స్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో బాబు జేసీ ఒత్తిడికి త‌లొగ్గి జిల్లాలో ఒక‌టి రెండు సీట్లు కూడా మార్చారు. ఇప్పుడు వారు పార్టీని మ‌రింత ఇబ్బంది పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో పాటు పాత నేత‌ల‌నే సైడ్ చేసేలా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతోనే బాబును వారిని కంట్రోల్లోకి తెచ్చుకునే యాక్ష‌న్ ప్లాన్ స్టార్ట్ చేసిన‌ట్టు క‌న‌ప‌డుతోంది.



Tags:    

Similar News