తాజ్‌ మ‌హ‌ల్ కాదు...రామ్ మ‌హ‌ల్‌

Update: 2018-06-12 14:57 GMT
ఉత్తర్‌ ప్రదేశ్ భైరియా బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2024 నాటికి భారత్ హిందూ దేశంగా అవతరిస్తుందని ఆయన గతనెలలో వ్యాఖ్యానించారు. తాజాగా భారత్ మాతాకీ జై అనని వారు పాకిస్థానీలని ఓ కార్యక్రమంలో అన్నారు. దీంతోపాటు వందేమాతరం పలుకని వారిని కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు అనుమతించొద్దని సూచించారు. తన తల్లిని - మాతృభూమిని గౌరవించనివారి దేశభక్తిని అనుమానించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు వ్యభిచారులని - లంచం అడిగితే వారి ముఖంపై చెప్పుతో కొట్టాలని గతంలో సురేంద్రసింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇలా నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ తాజాగా ప్రముఖ కట్టడం తాజ్‌మహల్‌పై నోరుజారారు.

మొఘలుల కాలంలో నిర్మించిన రహదారులు - స్మారక కట్టడాలు - నిర్మాణాల పేర్లను మార్చాలని సురేంద్ర సింగ్ డిమాండ్ చేశారు. అలాగే తాజ్‌ మహల్ పేరును రామ్ మహల్ లేదంటే కృష్ణ మహల్ - శివాజీ మహల్‌ గా మార్చాలని ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ``మొఘలుల నిర్మాణాలను ప్రస్తుతం ధ్వంసం చేయలేం. ఎందుకంటే అవి ఇక్కడి మట్టి, వనరులతో నిర్మించారు. కాబట్టి ఆ నిర్మాణాలకు ఇక్కడి వారి పేర్లు పెట్టడమే సముచితం. నాకు అవకాశం ఇస్తే తాజ్‌మహల్‌కు రాష్ట్ర భక్త మహల్ అని నామకరణం చేస్తా. మొఘలుల ఏదైనా కట్టడానికి డాక్టర్ అబ్దుల్ కలాం పేరు పెట్టండి. ఆ అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కోల్‌ కతాలోని విక్టోరియా మహల్ పేరును జానకి ప్యాలస్ అని మారిస్తే బాగుంటుంది` అని వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News