జగన్ బిగిస్తే...మన మందుబాబులు ఏం చేస్తున్నారంటే?

Update: 2019-10-20 13:28 GMT
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మందుబాబులకు చాలా ఇబ్బందులే తలెత్తాయి. ప్రైవేట్ వైన్స్ ను మూసేసిన జగన్ సర్కారీ మద్యం షాపులు తెరవడంతో పాటు మద్యం విక్రయాల సమయాన్ని కూడా బాగా తగ్గించేశారు. జగన్ అయినా, ఇంకెవరైనా మందు బాటిల్ బిరడా బిగిస్తే... మందుకు అలవాటు పడ్డ ప్రాణాలు అలా చూస్తూ ఊరుకోవు కదా. అందుకే జగన్ సర్కారు మద్య నియంత్రణ దిశగా అడుగులు వేస్తుంటే... ఏపీ మందు బాబులు ఇప్పుడు కొత్త రూట్ కనిపెట్టేశారు. ఏపీలో తగ్గిన మద్యం అమ్మకాలు తగ్గితే... అదే సమయంలో మనోళ్ల మద్యపాన ప్రియత్వంతో కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో మందు పొంగి పోరలుతోంది. ఏపీలోని మందు బాబులు ప్రత్యేకించి... యానాంకు కూతవేటు దూరంలోని తూర్పు గోదావరి జిల్లా మందు బాబులు ఇప్పుడు నేరుగా యానాం చెక్కేస్తున్నారు. ఫలితంగా యానాంలో మద్యం అమ్మకాలు అమాంతంగా పెరిగిపోయాయి.

సాధారణంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో మద్యంతో పాటు దాదాపుగా అన్ని రకాల వస్తువులు తక్కువ ధరలకే దొరుకుతాయి. అంతేకాకుండా అక్కడి మద్యం కూడా ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఓ మోస్తరు క్వాలిటీగానే ఉంటుంది. అంతేకాదండోయ్... అక్కడ మద్యపానంపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. రాత్రి పొద్దుపోయే దాకా తాగొచ్చు. తూలొచ్చు కూడా. ఏపీలో మద్యపానంపై నియంత్రణ లేని సమయంలో కూడా పెద్ద ఎత్తున జనం యానాంకే వెళ్లి పార్టీలు చేసుకున్న వైనం కూడా మనకు తెలిసిందే. అలాంటిది... ఇప్పుడు జగన్ ఏపీలో మందు బాటిళ్లకు బిరడాలు బిగించేస్తుంటే... మందుబాబులు చూస్తూ ఊరుకుంటారా? జగన్ కాకపోతే... యానాం పొదాం పదండి అంటూ ఇప్పుడు పోలోమంటూ పడవ ఎక్కేస్తున్నారు. ఎంచక్కా యానాంలో తక్కువ ధరలకే మద్యం కొనుక్కొని ఆంక్షలు లేని అక్కడే తూలిపోతున్నారు.

ఇదివరకు ఓ సారి స్టాక్ తెస్తే... యానాంలో ఆ స్టాకంతా అయిపోవడానికి 24 రోజులు పట్టేదట. జగన్ లిక్కర్ పాలసీ పుణ్యమా అని ఇప్పుడు 24 రోజులకు సరిపడే స్టాకు 18 రోజుల్లోనే ఖాళీ అయిపోతోందట. ఫలితంగా మరింత మేర స్టాకును యానాంకు తరలించేస్తున్నారట. ఇందుకోసం యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు... ఏపీ సర్కారుతో మాట్లాడి మరీ యానాంకు మరింత మేర సరుకు రవాణాకు అనుమతులు కూడా తీసుకున్నారట. ఏదేమైనా... తాగి తందానాలు ఆడి జీవితాలు బుగ్గి చేసుకోండి బాబూ అంటూ జగన్ మద్యపాన నియంత్రణకు అడుగులు వేస్తుంటే... మందుబాబులు మాత్రం కొత్త కొత్త రూట్లు వెతుక్కుని మరీ మత్తులో తూలిపోతున్నారట.

Tags:    

Similar News