తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు - ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డి మరోమారు ఫోన్ ట్యాపింగ్ ను తెరమీదకు తీసుకువచ్చారు. తెలంగాణవాదుల పక్షాన నిలుస్తున్న తనను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అమరుల కుటుంబాల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలనే డిమాండ్ తో ఓయూలో విద్యార్థులు తలపెట్టిన కార్యక్రమానికి తాను హాజరవుతుండటాన్ని జీర్ణించుకోలేని ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేయిస్తోందని ఆరోపించారు.
అయినప్పటికీ తానేమీ వెరవడం లేదని అమరుల కుటుంబాల కోసం ఓయూకి వెళుతున్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలంటే అమరువీరుల స్థూపాన్ని బుద్ధుడి పక్కన పెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే సందర్భంగా తెలంగాణ పేరు మార్చనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ టీజీగానే పాపులర్ అయిందని, తాము అధికారంలోకి వచ్చాక టీఎస్ ను టీజీగా మారుస్తామని ప్రకటించారు.