కేసీఆర్ చెన్నై వెళ్లిన విమానం ఎవ‌రిది- రేవంత్‌

Update: 2018-08-09 17:38 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ కేసీఆర్ చుట్టూ మ‌రో వివాదం ముసురుకునేట‌ట్లు క‌నిపిస్తోంది. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌ పై అవకాశం దొర‌క‌డ‌మే ఆల‌స్యం అన్న‌ట్లుగా స్పందించే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. రాజ్య‌స‌భ ఉప ఎన్నిక మొద‌లుకొని - ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌నితీరు వ‌ర‌కు - త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి మ‌ర‌ణం వ‌ర‌కు రేవంత్ ప‌లు అంశాల‌పై ఆస‌క్తిక‌రంగా స్పందించారు. ఈ సంద‌ర్బంగా కేసీఆర్‌ పై కొత్త ఆరోప‌ణ‌లు కూడా చేశారు. రాజ్యసభ వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేయ‌డం ద్వారా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి - తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు ఉన్న దోస్తీ మ‌రోమారు స్ప‌స్ట‌మైంద‌న్నారు. రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో మోడీకి మద్దతు తెలప‌డం ద్వారా వచ్చే ఎన్నికల్లో మోడీతో కలిసి వెళ్లబోతున్నారని సిగ్న‌ల్స్ ఇచ్చార‌న్నారు. మైనార్టీ రిజర్వేషన్‌కు సహకరించని మోడీకి ఎందుకు మద్దతు ఇచ్చారో టీఆర్ ఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు.

టీఆర్ ఎస్ ప్రభుత్వంలో నిబంధ‌న‌ల ఉల్లంఘన‌ పెద్ద‌ ఎత్తున జ‌రుగుతోంద‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. చ‌త్తీస్‌ గడ్ నుంచి కొనుగోలు చేస్తున్న కరెంట్ వ్యవహారంపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధిక ధరలు పెట్టి కొనాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చత్తీస్‌గడ్ మార్వా విద్యుత్ ఉత్పత్తి కంపెనీకి అధాని కంపెనీలు బొగ్గు సరఫరా చేస్తున్నాయని అన్నారు. అదాని కంపెనీలను బతికించటం కోసమే కేసీఆర్ చత్తీస్ ఘడ్ లో కరెంట్ కొంటున్నాడని ఆరోపించారు. మార్వా కంపెనీ విద్యుత్ ను తెలంగాణ కొనుగోలు చేయకపోతే అదాని కంపెనీ దివాళ తీసేదని అన్నారు. కరుణానిధిని చూడడానికి అదాని సొంత విమానంలోనే కేసీఆర్ చెన్నై వెళ్లారని ఆరోపించారు. కేసీఆర్-మోడీకి మధ్య ఆదానీ అనుసంధానకర్తగా ఉన్నాడని విమ‌ర్శించారు. తమిళ‌నాడుకు కేసీఆర్ అదానీకి చెందిన స్వంత విమానంలో వెళ్లిన సంగతి నిజం కాదా  అని ఆయ‌న ప్ర‌శ్నించారు. తెలంగాణను అదానీ-కేసీఆర్‌లు దోచుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు.

రాహుల్ గాంధీ తెలంగాణ టూర్‌ను అడ్డుకుంటే ఖబర్దార్ అని రేవంత్ హెచ్చ‌రించారు. దమ్ముంటే కేటీఆర్ - హరీష్ రావులు ముందుండి రాహుల్ టూర్ అడ్డుకోవాలని స‌వాల్ విసిరారు. కేటీఆర్ - హరీష్‌ లను కాంగ్రెస్ కార్యకర్తలు కాళ్ళకింద వేసి తొక్కుతారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ..మరోసారి బీసీ దళితుల విద్యార్థులను బలిచేస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ``హరీష్  - కేటీఆర్ మీరు రండి.. ముందు నేనుంటా ..! అమాయకులను ఎందుకు ముందు పెడతారు?ధైర్యం ఉంటె ముందు మీరుండి అడ్డుకోండి`` అని స‌వాల్ విసిరారు.
Tags:    

Similar News