కేసీఆర్ భ‌వ‌న్ గా మారిన అసెంబ్లీ

Update: 2016-12-21 19:30 GMT
శాసన సభలో అత్యంత కీలకమైన రైతుల సమస్యలపైన చర్చ సందర్బంగా సభ్యుకు మాట్లాడే పరిస్థితి లేదని టీడీపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ అసెంబ్లీ కేసీఆర్ భవన్ గా మారిందని ధ్వ‌జ‌మెత్తారు. సభలో కేసీఆర్ ని పొగిడితేనే మైక్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిందని రేవంత్ రెడ్డి విశ్లేషించారు. అందులో కేసీఆర్ అనుకూల వర్గం ఒక‌టైతే...కేసీఆర్ వ్యతిరేక వర్గం ఇంకొక‌టి అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ లో ఓ వర్గం చేస్తుందని రేవంత్ ఆరోపించారు.

రాజకీయ కుట్రలకు స్పీకర్ కార్యాలయం స్థావరంగా మారిందని రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స్పీకర్ కార్యాలయం రెండు నాలుకలు దొరనిగా వ్యవహరిస్తోందని మండిప‌డ్డారు. త‌మ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల‌తో స‌హా కాంగ్రెస్ నుంచి పార్టీ మారిన స‌భ్యుల‌పై వేటు వేయాల‌ని కోరితే ఇప్ప‌టికీ స్పీక‌ర్ స్పందించ‌లేద‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇలా స్పీక‌ర్ ప‌క్ష‌పాత దోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆక్షేపించారు. ఈ విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ స్పీకర్ పైన అవిశ్వాసం పెట్టడానికి ముందుకు రావాల‌ని కాంగ్రెస్ పార్టీని ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి కోరారు. లేకపొతే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని తేలిపోతుందని విశ్లేషించారు.
 
రైతుల పక్షపాతిగా చెప్పుకుంటున్న టీఆర్ ఎస్ ప్రభుత్వం రైతులకి మాత్రం రుణ మాఫీ చేసే ప్రయత్నం చెయ్యటం లేదని మండిప‌డ్డారు. రైతుల మరణాలకు ప్రత్యేక్షంగా ప్రభుత్వమే కారణం అవుతోంద‌ని ఆరోపించారు. రైతులవి ఆత్మహత్యలు కావని - ప్ర‌భుత్వ హత్యలేన‌ని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. రైతుల మరణాలకు సంబంధించి ముఖ్యమంత్రి పైన హత్యా నేరం కింద కేస్ పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నకిలీ విత్తన కంపెనీలు విలయతాండవం చేస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. నకిలీ విత్తన కంపెనీలపైన సంబంధిత శాఖ‌ కమిషనర్ నోటీస్ లు ఇస్తే ...కమిషనర్ పైన ప్రభుత్వం ఒత్తిడి తీసుకు వచ్చి నకిలీ విత్తన కంపెనీలకు సపోర్ట్ గా నిలిచిందని వెల్ల‌డించారు. 2700 మంది రైతులకి 6 లక్షల రూపాయల నష్ట పరిహారం ఇస్తే 250 కోట్లు మాత్రమే అవుతుందని కానీ  రైతులకి ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యకుండా కేసీఆర్ తన స్వలాభం కోసం ఉపయోగించుకుంటూ..విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే రాష్ట్రం ఏర్పడిన త‌ర్వాత వారికి ద‌క్కింది ఏమిట‌ని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News