టీటీడీపీకి కొత్త పేరు పెట్టిన రేవంత్ రెడ్డి

Update: 2016-05-23 04:28 GMT
తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ - ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌ రెడ్డి టీడీపీని మ‌రింత‌గా కునారిల్ల‌కుండా చూసేందుకు శ‌క్తివంచ‌న లేకుండా కృషిచేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఆత్మ‌స్థైర్యం నింపేందుకు జిల్లాల ప‌ర్య‌ట‌న పెట్టుకున్న రేవంత్ రెడ్డి తాజాగా మెద‌క్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకే కేసీఆర్‌ జిల్లాల పునర్విభజనను తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు.

తన కొడుకు - కూతురు - మేనల్లుడి సౌలభ్యం-ఆధిపత్యం కోసమే ఎక్కడా లేని విధంగా కేవలం రెండు - మూడు నియోజకవర్గాలు - 10-15 మండలాలను కలిపి ఒక జిల్లాను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్‌ పూనుకుంటున్నారని రేవంత్ విమర్శించారు. టీఆర్‌ ఎస్‌ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో భూములను లాక్కుంటూ మార్కెట్‌ రేటు ప్రకారం పరిహారమివ్వకుండా కేసీఆర్‌ దొరల పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌ భూములను దళితులకు పంచాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఫాంహౌస్‌ లో మంచినీటి పైపులు సైతం వేయించామని గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్‌ ఎస్‌ నాయకులు ఆయన భూమిలో రెండు బావుల్లో నీటిని నింపుకునేందుకే పైప్‌ లైన్‌ వేయించారనే విష‌యాన్ని ప్ర‌క‌టించాల‌ని చెప్పారు.

మెదక్‌ జిల్లాలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తామని కార్యకర్తలకు రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పార్టీకి సంబంధించిన స‌మ‌స్య‌లైన‌ - ప్ర‌జా స‌మ‌స్య‌లు అయినా త‌న దృష్టికి తీసుకురావాల‌ని శ్రేణుల‌కు సూచించారు. 'తెలంగాణ మట్టి మనదిరా... తెలుగుదేశం పార్టీ మనదిరా..' అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఇదిలాఉండ‌గా వైసీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు అశోక్‌ గౌడ్‌ తన అనుచరులతో రేవంత్‌ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.
Tags:    

Similar News