అజ‌య్‌ది రాక్ష‌సానందం.. : మంత్రిపై రెచ్చిపోయిన రేవంత్‌

Update: 2022-04-26 12:35 GMT
తెలంగాణ ర‌వాణా శాఖ మంత్రి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమకేసులు, పీడీ యాక్ట్లు పెట్టించి మంత్రి  రాక్షస ఆనందం పొందుతున్నారని విమర్శించారు. మంత్రి పువ్వాడకు కాంగ్రెస్ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని... అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వరంగల్‌లో జరగనున్న రాహుల్‌ గాంధీ సభ సన్నాహక సమావేశాన్ని ఖమ్మం జిల్లాలో నిర్వహించారు.

``కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలతో పెట్టుకుంటే అగ్గితో పెట్టుకున్నట్లే. అజయ్ నాకు సవాల్ విసిరారు. తనపై విచారణ చేయిస్తే వాస్తవాలు ఉంటే రాజీనామా చేస్తామన్నారు. నేను సూటిగా సవాల్ విసురుతున్న పువ్వాడ అజయ్కి. సీబీఐ విచారణకు నువ్వు లేఖ రాయి. నీ కాలేజీ నిర్వాహణ, సిబ్బంది వేతనంలో కోత గురించి అన్నింటిని నిరూపించే బాధ్యత నేను తీసుకుంటా`` అని స‌వాల్ విసిరారు.

పువ్వాడ అజయ్ ప్రతిపక్ష పార్టీల్లోని నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని రేవంత్‌ మండిపడ్డారు. అజయ్ సైకోలా వేధింపులకు పాల్పడుతూ పైచాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. అజయ్ దుర్మార్గాలకు సాయిగణేష్ మృతి చెందాడన్నారు. నేడు పువ్వాడ అజయ్ తన సొంత కులాన్ని అడ్డం పెట్టుకుని తనపై కుట్ర జరుగుతుందన డం హస్యస్పందంగా ఉందన్నారు. అజయ్ ఉన్మాదిగా మారాడని  ఆక్షేపించారు.

అజయ్ అక్రమాలపై, తన  మెడికల్ కళాశాలలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తాను అన్న మాట ప్రకారం మమత మెడికల్ కళాశాలల్లో అక్రమాలను నిరూపిస్తా.. దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్ధంగా ఉండాలని అజయ్‌కి రేవంత్‌రెడ్డి సవాల్  విసిరారు. ప్రతిపక్ష నాయకులపై మంత్రి అజయ్‌ కేసులు పెట్టించి వేధిస్తున్నారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

ఇదిలావుంటే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తొలిసారిగా జిల్లాకు రావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. జిల్లా సరిహద్దు కూసుమంచి నుంచి ర్యాలీ నిర్వహించి, స్వాగతం పలికారు. నాయకుని గూడెం వద్ద వందలాది వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పాలేరులో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఏర్పాటు చేసిన డీజేను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ శ్రేణులు పోలీసులు వాగ్వాదానికి దిగారు.

ఖమ్మం పట్టణంలోనూ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రేవంత్‌రెడ్డి రాక సందర్భంగా జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నగరపాలక సిబ్బంది వాటిని తొలగించటంతో... పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. నగరపాలక వాహనానికి సంబంధించి అద్దాలు ధ్వంసం చేశారు. కాగా, పువ్వాడ‌పై  రేవంత్ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Tags:    

Similar News