అమెరికాలో ఉన్న‌ప్ప‌టికీ కేసీఆర్‌ ను వ‌దిలిపెట్ట‌ని రేవంత్

Update: 2017-07-05 04:07 GMT
అవ‌కాశం దొర‌క‌డ‌మే ఆల‌స్యం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై - టీఆర్ ఎస్‌ పై విరుచుకుప‌డ‌టానికి తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉంటార‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. హైద‌రాబాద్‌ లో ఉన్నా, జిల్లాల్లో ప‌ర్య‌టించినా ఈ దూకుడును ప్ర‌ద‌ర్శించే రేవంత్ రెడ్డి అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న సంద‌ర్భంగా ఇందులో ఒక్క శాతం కూడా తేడా లేకుండా చూసుకున్నారు. అమెరికాలో ఓ సంఘం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వెళ్లిన రేవంత్ అక్క‌డ బిజీ బిజీగా గ‌డుపుతున్న‌ప్ప‌టికీ రాష్ట్ర ప‌రిణామాల‌పై స్పందించారు. కేంద్రం కొత్తగా విదించిన జీఎస్టీ పన్ను విషయంగా రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ఒక విధంగా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి మరోవిధంగా మాట్లాడుతూ జీఎస్టీపై ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. జీఎస్టీ కారణంగా రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని ఆర్థికమంత్రి చెబుతుంటే దానికి భిన్నంగా జీఎస్టీతో రాష్ట్రానికి వేలకోట్ల రూపాయాల లాభం కలుగుతుందని ముఖ్యమంత్రి ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటని ఆయన నిలదీశారు.

జీఎస్టీపై సీఎం చంద్రశేఖర్ రావు, మంత్రి ఈటల రాజేంద‌ర్ చేసిన ప్రకటనల నేపథ్యంలో మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. రాష్ట్రంలో జీఎస్టీ పన్ను విధింపు కారణంగా రాష్ట్రానికి ఏటా రూ. 3 వేల కోట్ల పైచిలుకు నష్టం వాటిల్లితుందని ప్రాజెక్టులు, రోడ్లు, పలు అభివృద్ది పథకాలపై పెనుభారం పడుతుందని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి ఈటెల రాజేందర్ ఇటివల ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. అందుకే ఈ అంశాన్ని జీఎస్టీ మండలిలో కూడ లేవనెత్తుతామని ఈటెల స్పష్టంగా చెప్పారని తెలిపారు. వ్యాట్ రిజిష్ట్రేషన్లు, మోటర్ వాహన పన్ను, ఎక్సైజ్ వంటి రాష్ట్రపన్నుల రాబడి ప్రస్తుతం రూ. 35 వేల కోట్ల నుంచి రూ. 40 వేల కోట్లదాకా ఉండగా ఇందులో 4% చొప్పున రూ. 1500 కోట్ల నష్టం వాటిల్లుతుందని, ఇతరత్రా మార్గలలో మరో రూ. 1500 కోట్ల పైచిలుకు నష్టం వాటిల్లుతుందని కూడ ఆర్థికమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. అయితే సోమవారం ముఖ్యమంత్రి కేసిఆర్, జీఎస్టీ పై సమీక్షా  సమావేశం అనంతరం జీఎస్టీ కారణంగా రాష్ట్రానికి రూ. 3 వేల కోట్ల దాకా అధనపు ఆదాయం వస్తుందని ప్రకటించడంతోపాటు జీఎస్టీ కారణంగా రాష్ట్రానికి ఎటువంటి నష్టంలేదని స్పష్టం చేశారని రేవంత్ ప్రస్తావించారు. ఆర్థికమంత్రి రూ. 3 వేల కోట్ల నష్టం వస్తుందని చెబుతుంటే ముఖ్యమంత్రి రూ. 3 వేల కోట్ల లాభం వస్తుందని చెబుతున్నారని పరస్పర భిన్నమైన ఈ ప్రకటనలు ప్రజలలో అయోమయాన్ని గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని విమర్శించారు.

జీఎస్టీ కారణంగా రాష్ట్రానికి లాభం కలుగుతుందా? లేక నష్టం వస్తుందా? అనే అంశంపై ప్రభుత్వం తక్షణమే వివరణ ఇవ్వాలని, దీనిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో పెద్దనోట్ల రద్దు సందర్భంగా కూడ సిఎం కేసిఆర్ ఇది చాలా అనాలోచితమైన చర్య అని ఈ కారణంగా దేశానికి చాలా నష్టం వాటిల్లుతుందని ఒకసారి, ఇది బ్రహ్మండమైన పథకమని దానిని మరింతగా కట్టుదిట్టంగా అమలుచేయడానికి తాను కూడ సూచనలు చేశానని ఇంకోకసారి మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అతి ముఖ్యమైన జీఎస్టీ సమీక్షా సమావేశంలో ఎంపీ కే.కేశవరావు ఆర్థికశాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నారని అయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడపాల్సిన ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేంధర్ ఈ సమావేశానికి ఎందుకు హజరు కాలేదని రేవంత్ ప్రశ్నించారు.

రాష్ట్రానికి సంబందించిన ప్రధాన ఆర్థిక అంశంపై సమీక్షించే సమావేశంలో ఆర్థికమంత్రి లేకపోవడం సిఎం, ఆర్థిక మంత్రుల మధ్య ఉన్న విబేధాలకు తార్కాణం అని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ పై సమీక్షా సమావేశంలో పాల్గొనడానికి టీఆర్ఎస్ పార్లమెంటరీనేత కే.కేశవరావుని ఆహ్వనించిన సీఎం ఆర్థికమంత్రిని ఆహ్వానించారా? లేదా? ఒకవేళ ఆహ్వానించినా ఆయన సమావేశానికి గైర్హాజరు అయ్యారా? అనే అంశాలపై కూడ సిఎం స్పష్టతనివ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. జీఎస్టీ కారణంగా ప్రభుత్వ ఆదాయంలో వచ్చే హెచ్చుతగ్గులు, అభివృద్ది పథకాలపై పడే భారం తదితర అంశాలపై స్పష్టతను ఇస్తూ జీఎస్టీపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కోరారు.


Tags:    

Similar News