శంషాబాద్ జిల్లా గుట్టు విప్పిన రేవంత్

Update: 2016-09-04 10:26 GMT
కొత్త జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్ సర్కారు చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ విపక్షాలు విమర్శల్ని తీవ్రతరం చేస్తున్నాయి. ఓపక్క కొత్త జిల్లాల ఏర్పాటుపై చకచకా పనులు జరిగిపోతుంటే.. అంతే వేగంగా విపక్షాలు తమ విమర్శల తీవ్రతను పెంచుతున్నాయి. ఓపక్క కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ రెండు రోజుల దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. డీకే దీక్ష పుణ్యమా అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక్క జట్టుగా తెర మీదకు రావటమే కాదు.. తెలంగాణ సర్కారు తీరును తీవ్రస్థాయిలో తప్పు పట్టారు.

ఇదిలా ఉంటే..తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రకటించిన కొత్త జిల్లాల్లో శాస్త్రీయత లేదని.. జిల్లాల విభజన లోపభూయిష్టంగా జరిగిందని మండిపడ్డారు. తమ పాలన మీద తెలంగాణ ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని తగ్గించటానికి.. ప్రజల దృష్టిని మళ్లించటానికే కొత్త జిల్లాల అంశాన్ని తెరమీదకు తెచ్చినట్లుగా ఆయన విమర్శించారు.

ఓపక్క కొత్త జిల్లా కోసం ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నాపట్టని ప్రభుత్వం.. ఎవరూ కోరకుండానే శంషాబాద్ జిల్లాను ప్రకటించటంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. శంషాబాద్ జిల్లాను ప్రకటించటం వెనుక పెద్ద కుట్ర ఉందని చెబుతున్నారు. శంషాబాద్ జిల్లాలోతెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుడైన మైహోం రామేశ్వరరావుకు ఐదు వేల ఎకరాల భూమి ఉందని.. ఆ భూమికి భారీ ధరలు వచ్చేందుకు వీలుగా జిల్లా ప్రకటన చేసినట్లుగా ఆయన ఆరోపించారు.

ఓపక్క కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న రియాక్ట్ కాని కేసీఆర్ సర్కారు.. శంషాబాద్ జిల్లాను ఎవరు అడిగారని సూటిగా ప్రశ్నించారు. ఎంతో చరిత్ర కలిగిన వరంగల్.. హన్మకొండను ఎలా విడదీస్తారని ప్రశ్నించిన ఆయన.. కొత్త జిల్లాల ఏర్పాట్లలో చాలా తప్పులు చోటు చేసుకున్నాయని.. ఒక పద్ధతి పాడులేకుండా చేశారంటూ దుయ్యబట్టారు. రేవంత్ సంచలన ఆరోపణపై కేసీఆర్ ఏం సమాధానం చెబుతారు?
Tags:    

Similar News