కేసీఆర్‌ తో కాంగ్రెస్ నేతల కుమ్మ‌క్కు

Update: 2016-10-08 16:48 GMT
కొత్త జిల్లాల పేరుతో కేసీఆర్ రాజకీయ కుట్ర‌కు తెర‌తీశార‌ని టీడీపీ శాస‌న‌సభాప‌క్ష నేత  రేవంత్ రెడ్డి ఆరోపించారు. చట్టాలకు వ్యతిరేకంగా - రిజర్వేషన్లకు విఘాతం క‌లిగించే చేసిన ఈ విభ‌జ‌న‌తో ఎస్సీ - ఎస్టీ నాయకత్వానికి  ముప్పు పొంచి ఉన్నప్ప‌టికీ కాంగ్రెస్ నాయకత్వం  చోద్యం చూస్తున్నద‌ని ఆరోపించారు. కొత్త జిల్లాల వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా సీఎం కేసీఆర్‌ తో కుమ్మక్కైందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ ఆస‌క్తిక‌ర‌మైన డిమాండ్ చేశారు.

సెప్టెంబర్ 20 నుంచి రాష్ట అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించినా దాన్ని పట్టించుకోకుండా అసెంబ్లీని వాయిదా వేసి కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుంటే నిలదీసి పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు వంత పాడుతుండ‌టం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని రేవంత్ విమర్శించారు. కొత్త జిల్లాలపై గతంలో వేసిన కేబినెట్ సబ్ కమిటీ ఉండగా కేసీఆర్ కొత్తగా కె.కేశవరావుతో హైపవర్ కమిటీని ప్రకటించారని అయితే ఈ కమిటీ విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వక ముందే కొత్తగా నాలుగు జిల్లాలను ప్రకటించడంతోపాటు వాటిని ఎక్కడ, ఏ మంత్రి ప్రారంభించారనే విషయాన్ని కూడా కేసీఆర్ నిర్ణయించి ప్రకటించేశారని చెప్పారు. దీంతో కేశవరావు కమిటీ వట్టి గాలి కమిటీ అని తేలిపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ రాష్ట అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకో రెవెన్యూ డివిజన్‌ కేటాయించాలని కేశవరావుకు వినతి పత్రం సమర్పించడం చిన్నపిల్లలు నాకు చాక్లెట్ ఇమ్మని అడిగినట్లు ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట పునర్విభజన చట్టాన్ని తయారు చేయించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలోనే ఉన్నారని ఆ చట్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ చర్యలు ఉంటే ఎందుకు నోరు విప్పరని నిలదీశారు. ఈ వ్యవహారంలో జైపాల్ రెడ్డి బయటికి రావాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రపునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా డీలిమిటేషన్ కు ముందే జిల్లాల సరిహద్దులను మార్చడానికి కేసీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నంలో కాంగ్రెస్ నాయకులు ప్రజల వైపున ఉంటారో, కేసీఆర్ బందెల దొడ్లో చేరుతారో నిర్ణయించుకోవాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.  

కుట్రపూరితంగా కేసీఆర్ చేస్తున్న కొత్త జిల్లాల వ్యవహారం కారణంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జరిగే అన్యాయానికి జైపాల్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొత్త జిల్లాల విషయంలో తాము చేయబోతున్న పోరాటానికి రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా సహకరించి కేసీఆర్‌ వ్యతిరేకించాలని రేవంత్ రెడ్డి సూచించారు. కేసీఆర్‌ను వ్యతిరేకించకపోతే ఆయనకు లొంగిపోయినట్లేనని గుర్తించాలని రేవంత్ కోరారు. అయితే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌ లొంగిపోయినా ప్రజలకు అన్యాయం జరుగుతుంటే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పాత జిల్లాల ప్రాతిపదికనే డీలిమిటేషన్ పార్లమెంట్ ఆమోదించిన రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారంగా డీలిమిటేషన్ జరిగినప్పుడే ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి న్యాయం జరుగుతుందని ఆవిధంగా జరగాలంటే తెలంగాణలోని పాత జిల్లాల ప్రాతిపదికనే నియోజకవర్గాల డీలిమిటేషన్ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News