వరి కొనరా.. కేసీఆర్ కు ఉరే.. ఫైర్ బ్రాండ్ సంచలనం

Update: 2022-02-27 03:36 GMT
మంట పుట్టే మాటలతో.. ఆవేశం.. దాంతో పాటు ఆలోచనను రంగరించుకున్నట్లుగా ఉండే ప్రసంగాలతో అందరిని ఆకర్షిస్తుంటారు తెలంగాణ పీసీసీ రథసారధి కమ్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. ఇటీవల కాలంలో కాస్తంత డల్ అయ్యారని.. తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతున్న పొలిటికల్ ఫైట్ లోకి తాను ఎంట్రీ ఇవ్వాలని తెగ ట్రై చేసినా సాధ్యం కాని వేళ.. మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు రేవంత్ రెడ్డి.

ఇదిలా ఉంటే.. ఇటీవల చర్చ నుంచి పక్కకు వెళ్లిన వరి కొనుగోలు అంశాన్ని మళ్లీ తెర మీదకు తెచ్చేందుకు తెగ ట్రై చేస్తున్నారు రేవంత్ అండ్ కో. తాజాగా వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించిన మన ఊరు - మన పోరు బహిరంగ సభలో రేవంత్ చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రైతులు పండించిన వరిని కొనాల్సిందేనని.. లేదంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఊరేనంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ నోటి నుంచి వచ్చిన ఘాటు వ్యాఖ్యల్ని ఆయన మాటల్లోనే చూస్తే..

-  రైతులెవరూ అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు. కాంగ్రెస్‌ పార్టీ వారికి అండగా ఉంటుంది. పంటకోతకు వచ్చినప్పుడు వేలమంది కార్యకర్తలు, రైతులు కలిసి కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ను ముట్టడిద్దాం. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుంటే కేవలం రూ.10 వేల కోట్లతో రైతుల పంటను కొనొచ్చు. కానీ ఈ సన్నాసులకు మంచి ఆలోచనలు రావు.

-  తెలంగాణలో 45 లక్షల ఎకరాల్లో రైతులు వరి పండించారు. ఆ పంటను కొనబోమని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. కేసీఆర్‌ కూడా తన ఫామ్‌హౌజ్‌లో 150 ఎకరాల్లో వరి పండించారు. కేసీఆర్‌ పంటను ఎవరు కొంటరో.. వారు పేద రైతుల వరిని కొనాల్సిందే.
-  మరి ఇంతవరకు ఏం అభివృద్ధి జరిగింది? మీకు మంత్రి పదవి, మీ కుమారుడికి డబ్బులు తప్ప.. ప్రజలకు ఏం ఒరిగింది.

-  గోదావరి జలాలతో పరిగి, వికారాబాద్, తాండూరు ప్రాంత ప్రజల కాళ్లు కడుగుతా అని కేసీఆర్‌ ఇచ్చిన మాట తప్పితే ప్రశ్నించేందుకు మీకు మాటలు రావా? ప్రాణహిత–చేవెళ్ల, పాలమూరు ప్రాజెక్టులను కాంగ్రెస్‌ తెస్తే.. రద్దు చేసింది కేసీఆర్‌ కాదా? దమ్ముంటే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు వేసి చెప్పాలె.

-  కేసీఆర్‌ను నమ్మి రెండుసార్లు సీఎంని చేస్తే.. నీళ్లేమో ఏపీకి.. నిధులేమో మేఘా కుటుంబానికి పోయాయి. నియామకాలేమో కేసీఆర్‌ ఇంటిల్లిపాదికి వచ్చాయి. మరి తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరులకు, రైతులకు ఏం వచ్చింది?

-  నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన కొండా వెంకటరంగారెడ్డి, దేశ రాజకీయాలను శాసించిన మర్రి చెన్నారెడ్డి వంటివారు వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాన్ని ఏలారు. అటువంటి ప్రాంతం ఇప్పుడు రంజిత్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి వంటి సన్నాసుల పాలైంది.

-  చేవెళ్లకు గోదావరి నీళ్లు తెస్తారని ఎట్లా అనుకుంటాం? చేవెళ్లనేమో కొండపోచమ్మలో కలిపారు. చేవెళ్ల చెల్లెమ్మను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. అభివృద్ధి కోసం పార్టీ మారిన సబితా ఇంద్రారెడ్డి ఇప్పటివరకు ఏం డెవలప్ మెంట్ చేశారు?

-  ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మెదక్‌ జిల్లాకే పరిమితం చేసింది నిజం కాదా కేసీఆర్‌..? ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను కొడంగల్‌ వరకు తెస్తానంటే ఎవరూ వద్దనలేదు. స్వయంగా కేసీఆరే వద్దన్నాడు. ఇప్పుడు పాలమూరు–రంగారెడ్డినీ పడావు పెట్టిండు. ఇక ఈ ప్రాజెక్టు కట్టబోమని కోర్టులో అఫిడవిట్‌ వేసిం డు.

-  2014లో సీఎం అయ్యాక కేసీఆర్‌ చెప్పినట్టు మూడేళ్లలో పాలమూరు–రంగారెడ్డి పూర్తి చేసి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. తర్వాత ఏపీ పెట్టిన కేసుల వల్ల ఆ ప్రాజెక్టు ఆగింది. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు అన్యా యం జరుగుతోందని.. వందల మంది ప్రాణత్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నం.
Tags:    

Similar News