కాంగ్రెస్ కు మంచిరోజులు.. రేవంత్ రెడ్డికి పెరుగుతున్న మద్దతు

Update: 2023-01-17 05:36 GMT
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు, జూనియర్లుగా విడిపోయింది. వీరిలో సీనియర్లు రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మిగతా వారు మద్దతు ఇస్తున్నారు. అయితే సీనియర్లలో ఒకరైన కొండా సురేఖ.. రేవంత్ రెడ్డి వెన్నంటే ఉంటున్నట్లు కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె నిర్వహించిన ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి పాదయాత్రకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అందరూ కలిసి కట్టుగా ఉంటేనే వచ్చే ఎన్నికల్లో రాణించగలుగుతామని, ఇలా అధిష్టానాన్ని ధిక్కరిస్తే అందరికీ నష్టం కలుగుతుందని అన్నారు. దీంతో ఒక్కొక్కరు రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి జ్వాలాలో కొట్టుమిట్టాడుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీనియర్లు అలక మానడం లేదు. ఆయన తన సొంత ప్రయోజనాలకే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, పార్టీ కోసం ఏమాత్రం పనిచేయడం లేదని కొందరు సీనియర్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పార్టీ సమావేశంలో కొందరు రేవంత్ వర్గాన్ని వలస వాదులు అనడం వర్గపోరుకు ఆజ్యం పోసినట్లయింది. తమని వలసవాదులన్నారని రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తేవారు కమిటీకి రాజీనామా చేశారు. ఆ తరువాత దిగ్విజయ్ సింగ్ వచ్చిన సర్ది చెప్పినా సమస్య పరిష్కారం కాలేదు. అయితే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిని మార్చిన తరువాత సీనియర్లు కాస్త కూల్ అయినట్లు తెలుస్తోంది.

ఈ తరుణంలో సీనియర్ల నుంచి ఒక్కొక్కరు రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో కీలక నేత కొండా సురేఖ ఈ సందర్భంగా పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే ప్రతి ఒక్కరు కలిసి రావాలని అన్నారు. పీసీసీ చీఫ్ గా ఉన్న ఆయన పాదయాత్ర తన సొంత ప్రయోజనాల కోసం చేయడం లేదని, పార్టీని గాడిలో పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారని అన్నారు. అందువల్ల రేవంత్ రెడ్డి నిర్వహించే పాదయాత్రకు తాను పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఇదే సమయంలో కొండా సురేఖ పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి చేరారని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులంతా ఒకే మాట, ఒకే బాట లాగా ఉంటేనే పార్టీ అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాంగ్రెస్ నాయకులంతా బీజేపీలోకి వెళ్లాలని చూస్తున్నారని, కానీ తాను ఎప్పటికీ కాంగ్రెస్లోనే ఉంటానని అన్నారు. అయితే పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలని అన్నారు.

గత కొన్ని రోజులుగా రేవంత్ వర్గంపై పార్టీలో ఎంతో కాలం నుంచి ఉంటున్న వారంతా గుర్రుగా ఉన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మార్చితేనే పార్టీ బాగుపడుతుందని ఆరోపించారు. ఈ తరుణంలో  కాంగ్రెస్ లో ఎంతోకాలంగా ఉంటున్న కొండా సురేఖ రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. కొన్ని రోజులుగా కొండా సురేఖ పార్టీ యాక్టివిటీస్ లో కనిపించడం లేదు. దీంతో ఆమె బీజేపీలోకి మారుతారని వార్తలు వచ్చాయి. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకే ఇలా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులోనూ రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. మరి కొండసురేఖ బాటలో మరెంత మంది సీనియర్లు వస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News