2019లో రేవంత్ రెడ్డి పోటీ చేసే స్థాన‌మేది?

Update: 2016-10-15 09:54 GMT
తెలంగాణ‌లో కొత్త జిల్లాల ఏర్పాటుతో... అప్ప‌టిదాకా 10 జిల్లాల‌తో ఉన్న రాష్ట్రం ప్ర‌స్తుతం కాస్తా 31 జిల్లాలున్న పెద్ద రాష్ట్రంగా అవ‌త‌రించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో అప్ప‌టిదాకా ఆయా జిల్లాల్లోని నియోజ‌క‌వ‌ర్గాల కూర్పు కూడా స‌మూలంగా మారిపోయింది. 2019లో ఎన్నిక‌లు జ‌రిగేనాటికి నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రుగుతుందా? లేదా?... అన్న అంశాన్ని ప‌క్క‌న‌బెడితే... కొత్త జిల్లాలు ఏర్పాట‌వ‌డంతో రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాలు మారిపోక త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్ర‌జ‌ల‌కు పాల‌న మ‌రింత చేరువ అవుతుంద‌ని చెప్పిన సీఎం కేసీఆర్‌... ఆ మేరకే కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేశామంటూ ప్ర‌క‌టించారు.

ఇక కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా విప‌క్షాలకు చెందిన కీల‌క నేత‌ల‌కు ఝ‌ల‌క్ ఇచ్చే ప‌నిని గుట్టుచ‌ప్పుడు కాకుండా కేసీఆర్ పూర్తి చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో త‌న‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారిన టీ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ - టీ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ - మాజీ డిప్యూటీ సీఎం దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌. మాజీ మంత్రి జె.గీతారెడ్డి త‌దిత‌రుల నియోజ‌క‌వ‌ర్గాల రోస్ట‌ర్ల‌ను స‌మూలంగా మార్చేందుకు రంగం సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం. ఇందులో భాగంగా ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన దామోద‌ర‌ - గీతారెడ్డిలు వ‌రుస‌గా ఆందోల్‌ - జ‌హీరాబాదు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌గా - రేవంత్ రెడ్డి మొన్న‌టిదాకా పాలమూరు జిల్లాలోని కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. కొత్త జిల్లాల రంగ‌ప్ర‌వేశంతో కొడంగ‌ల్ ప్ర‌స్తుతం వికారాబాదు జిల్లాలోకి వెళ్లిపోయింది.

ఇక ఇప్ప‌టిదాకా ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌లాల్లో రేవంత్ రెడ్డికి మంచి ప‌ట్టుంది. కొత్త జిల్లాల పుణ్య‌మా అని ఆ నియోజ‌క‌వ‌ర్గం మూడు ముక్క‌లైపోయింది. కొడంగ‌ల్ లోని మండ‌లాలను మూడు జిల్లాల‌కు పంచేస్తూ ప్ర‌భుత్వం ప‌క్కాగా ప్లాన్ వేసింది. వెర‌సి రేవంత్ రెడ్డి బ‌లాన్ని భారీగా త‌గ్గించేస్తూ వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ వేసింది. ఈ విష‌యం తెలుసుకున్న త‌ర్వాతే... కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జ‌రిగింద‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం తాన‌నుకున్న రీతిలో కొత్త జిల్లాల విష‌యంలో ముంద‌డుగు వేసింది. ప‌లితంగా రేవంత్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గం అడ్రెస్ కాస్త గ‌ల్లంతైపోయింది. అస‌లు కొడంగ‌ల్ పేరిట ఓ నియోజక‌వ‌ర్గం కొన‌సాగుతుందా? లేదా? అన్న విష‌యం కూడా స్ప‌ష్టంగా తెలియ‌డం లేదు.

మ‌రి ఈ నియోజ‌క‌వ‌ర్గం ఉన్నా... మూడు ముక్క‌లైన ఆ నియోజ‌క‌వ‌ర్గంలో రేవంత్‌కు అంత‌గా బ‌లం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డి ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌న్న అంశంపై ప్ర‌స్తుతం జోరుగా చ‌ర్చ సాగుతోంది. వికారాబాదు జిల్లాకు వెళ్లిన కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచే ఆయ‌న పోటీ చేస్తార‌ని కొంద‌రు అంటున్నా... త‌న అత్త‌గారి ఊరు ఉన్న రంగారెడ్డి (శంషాబాదు) జిల్లా నుంచి ఆయ‌న పోటీ చేస్తార‌ని మ‌రికొంత మంది చెబుతున్నారు. ఎక్క‌డి నుంచి పోటీ చేసినా... రేవంత్ కొత్త స‌మీక‌ర‌ణాల‌తోనే ముందుకెళ్లాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీకి ఎన్నిక కాగ‌ల‌రా? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News