విద్యుత్ చార్జీలు పెంచొద్దు: రేవంత్‌రెడ్డి

Update: 2022-02-25 23:30 GMT
విద్యుత్తు ఛార్జీల పెంపుపై ట్రాన్స్‌కో ప్రతిపాదనలు నియంత్రణ మండలి తోసిపుచ్చాలని పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి అన్నారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వాల నుంచి బకాయిలు రాబట్టకపోవడంతో డిస్కంలు అప్పుల పాలు అయ్యాయని తెలిపారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు.

సరళీకరణలో భాగంగా విద్యుత్‌ సంస్థను ట్రాన్స్‌కో, జెన్కోగా మార్చారని అన్నారు. డిస్కంల అప్పులు రూ.60 వేల కోట్లకు చేరాయని... పార్టీల హామీలు డిస్కంలకు భారంగా మారాయని విమర్శించారు.

విద్యుత్ ఛార్జీల పెంపుపై హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ భవనంలో బహిరంగ విచారణలో సూచనలు, అభ్యంతరాలు ఈఆర్సీ స్వీకరించింది. బహిరంగ చర్చలో పాల్గొన్న రేవంత్ రెడ్డి... కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయాలను వివరించారు. ప్రభుత్వం కూడా ఒక వినియోగదారు అనే అంశాన్ని మర్చిపోతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.

ప్రభుత్వాల నుంచి బకాయిలు రాబట్టకపోవడంతో డిస్కంలు అప్పులపాలు అయ్యాయని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, పథకాలపై ఛార్జీలను ఏటా డిస్కంలకు ప్రభుత్వం రూ.16 వేల కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు.

ప్రభుత్వం మాత్రం ఏటా రూ.6 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఏటా రూ.10 వేల కోట్లను డిస్కంలకు ఎగవేస్తోందని అన్నారు. డిస్కంలకు ప్రధాన డిఫాల్టర్‌ రాష్ట్ర ప్రభుత్వమే అని ఆరోపించారు. నిర్వహణ లోపంతో విద్యుత్‌ తీగలు వేలాడుతున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు.

అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యుత్‌ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అధికారులపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టకూడదని ప్రశ్నించారు. టెక్నికల్ అధికారులను బిల్లుల వసూళ్లకు వాడుతున్నారని చెప్పారు. శ్రీశైలం విద్యుత్‌ ప్రాజెక్ట్‌లో జరిగిన ప్రమాదంలో 9 మంది చనిపోయారని... ప్రాజెక్ట్ ప్రమాదం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

``బిల్లు చెల్లించని వినియోగదారుపై చర్యలు తీసుకున్నట్లే ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలి. విద్యుత్‌ సంస్థ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కారణం. వినియోగదారులపై భారం మోపే డిస్కంలు ప్రభుత్వాన్ని ఎందుకు ఉపేక్షిస్తున్నాయి. రాజకీయ బాసుల మెప్పు కోసం విద్యుత్‌ సంస్థకు నష్టం చేస్తున్నారు`` అని రేవంత్ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News