రేవంత్‌ నడిస్తే వచ్చేది బలమా? ఆయాసమా?

Update: 2016-04-15 04:09 GMT
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చాలా ఫిట్‌ నెస్‌ ఉన్న నాయకుడు రేవంత్‌ రెడ్డి అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయ వేదికల మీదికి ఆయన నాయకుడి గెటప్‌ లో వస్తారు గానీ.. కూతురు పెళ్లి కూడా పూర్తిచేసిన వయస్సులో తాను ఉన్నప్పటికీ... ప్రెవేటు పార్టీలకు - ఇతరత్రా పెళ్లిళ్లు వంటి ఫంక్షన్లకు చేతుల కండలు బాగా కనిపించేలా బిగుతుగా ఉండే టీషర్టుల్లో.. బౌన్సర్లను తలపించే మాదిరిగా రేవంత్‌ రెడ్డి హాజరవుతుంటారు. అలాంటి రేవంత్‌ రెడ్డికి ఆదిలాబాద్‌ నుంచి ఆలంపూర్‌ వరకు పాదయాత్ర చేయడం అనేది నల్లేరుపై బండి నడక కావొచ్చు.

అయితే ఆయన నడవడం వలన ఇప్పటికే శవాసనం వేసి ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొత్త బలం సంతరించుకుంటుందా? అనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. రేవంత్‌ నడక వలన పార్టీకి బలం వస్తుందా? రేవంత్‌ కు ఆయాసం వస్తుందా? అని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ లో నాయకులు జోకులు వేసుకుంటున్నారు.
గతంలో పాదయాత్ర ద్వారా నాయకులు ఒకేసారి ముఖ్యమంత్రుల స్థానాల్లోకి వెళ్లిపోవడం అనే అనుభవాలు చూశారు గనుక.. రేవంత్‌ రెడ్డి తెలంగాణలో అలాంటి ప్రయత్నం చేయాలని ఆరాటపడుతున్నట్లుగా ఉంది. అయితే రేవంత్‌ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు, ప్రదర్శిస్తున్న దూకుడు పట్ల తెదేపాలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన నాయకత్వం కిట్టని వారు కూడా అనేకులు ఉన్నారు. ఆయన గనుక పాదయాత్ర నిర్వహిస్తే.. ఈ లుకలుకలు అన్నీ బయటపడే ప్రమాదం కూడా ఉన్నదని అనుకుంటున్నారు. అసలే ముక్కిడి ఆపై పడిశం అన్న సామెత చందంగా తెదేపా పరిస్థితి తయారవుతుందేమోనని పలువురు భయపడుతున్నారు.
Tags:    

Similar News