ఇక రేవంతుడి వంతు..!

Update: 2017-11-07 10:12 GMT
ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో పాద‌యాత్ర‌ల ట్రెండ్ కొన‌సాగుతోంది. ఎన్నిక‌ల ముందు ప్ర‌జ‌ల్లోకి నేరుగా చొచ్చుకుపోయేందుకు, వారితో మ‌మేక‌మ‌య్యేందుకు పాద‌యాత్ర‌ను ఏకైక మార్గంగా రాజ‌కీయ నాయ‌కులు ఎంచుకుంటున్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో వైఎస్‌.రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌జాప్ర‌స్థానం పేరిట చేప‌ట్టిన పాద‌యాత్ర ఆయ‌న‌కు తిరుగులేని ఇమేజ్‌ ను క‌ట్ట‌బెట్టింది. ఫ‌లితంగా ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో ఆయ‌న ముఖ్య‌మంత్రి కావ‌డం.. ఎన్నో ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టి ప్ర‌జ‌ల హ‌ృద‌యాల్లో చోటు ద‌క్కించుకోవ‌డం మ‌న‌కు తెలిసిందే.

ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు వ‌స్తున్నా మీ కోసం అంటూ సుదీర్ఘ పాద‌యాత్ర చేశారు. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ద‌గ్గ‌ర నుంచి గ‌మ‌నించారు. ఆ త‌ర్వాత త‌మ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో వాటికి ప‌రిష్కారాల‌ను పేర్కొన్నారు. అనంత‌రం జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికారం చేప‌ట్టి న‌వ్యాంధ్ర తొలి ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌తలు చేప‌ట్టారు.

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి కూడా ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు పాద‌యాత్రే స‌రైన ప‌ద్ద‌త‌ని భావించి ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర మొద‌లుపెట్టారు. ఇప్ప‌డు తెలంగాణ‌లోనూ ఓ కీల‌క నేత పాద‌యాత్ర ప్రారంభించాల‌ని భావిస్తున్నార‌నే వార్త‌లు హ‌ల్‌ చ‌ల్ చేస్తున్నాయి. ఇటీవ‌లే సైకిల్ దిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారా.. ? అందుకోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కొందరితో ఆ దిశలో చర్చలు జరుపుతున్నారా? అంటే అవుననే స‌మాధానం వ‌స్తోంది.

త్వరలో సార్వత్రిక ఎన్నికలు రానుండ‌టంతో పార్టీ బ‌లోపేతానికి కాంగ్రెస్ వ్యూహర‌చ‌న చేస్తోంది. టీటీడీపీ ఫైర్‌ బ్రాండ్‌ రేవంత్ చేరికతో అధికార టీఆర్ ఎస్‌ కు గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామ‌నే ఉత్సాహం కాంగ్రెస్ కేడర్‌ లో కనిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకువెళ్లేందుకు రేవంత్ పాదయాత్ర చేప‌ట్ట‌డంపై చర్చ సాగుతోందని స‌మాచారం. ఇప్ప‌టికే కాంగ్రెస్ సీనియ‌ర్ల‌ను క‌లుస్తున్న రేవంత్‌ రెడ్డి.. పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళుతూ తాను కూడా ఎలా ముందుకు వెళ్లాల‌నే వ్యూహంతో ఉన్న‌ట్లు సీనియ‌ర్ల‌కు చెబుతున్నారట‌. అందుకో్సం వారి స‌ల‌హాల‌ను కోరుతున్నార‌ట‌. బ‌లంగా ఉన్న టీఆర్ ఎస్‌ ను ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ ను దీటుగా ఎదుర్కోవాలంటే దూకుడుగా వ్య‌వ‌హ‌రించే రేవంతే క‌ర‌క్ట‌ని కాంగ్రెస్ కేడ‌ర్ భావిస్తున్న త‌రుణంలో.. ఆయ‌న కూడా త‌న‌ను తాను నిరూపించుకోవాల‌ని ఆలోచిస్తున్నార‌ట‌. దానికి పాద‌యాత్రే స‌రైన మార్గ‌మ‌ని భావిస్తున్నార‌ట‌.

త్వ‌ర‌లోనే రేవంత్ రెడ్డి పాదయాత్రపై నిర్ణ‌యం వెలువ‌డే అవకాశముందని, డిసెంబర్ తర్వాత ప్రారంభమయ్యే సూచ‌న‌లున్నాయ‌నే ప్రచారం కూడా కొన‌సాగుతోంది. ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న చందంగా.. రేవంత్ పాద‌యాత్ర‌ - కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడటంతో పాటు ఆయ‌న‌కు వ్యక్తిగత మైలేజ్ తీసుకువస్తుందని విశ్లేష‌కులు అంటున్నారు. తెలంగాణలో టీఆర్ ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ఆత్మహత్య చేసుకున్న రైతులు - గ‌తంలో తెలంగాణ కోసం ఉద్యమం సమయంలో అసువులు బాసిన వారి కుటుంబాల‌ను క‌లుసుకునేలా పాద‌యాత్ర కొన‌సాగించేలా రూట్‌ మ్యాప్ రూప‌క‌ల్ప‌న జ‌రుగుతోంద‌ని, దీనికి సంబంధించి కాంగ్రెస్‌ లో ముమ్మ‌రంగా చర్చ సాగుతోందని స‌మాచారం.
Tags:    

Similar News