ఇది రేవంత్ స్పెషల్ :తెలంగాణలో పాదయాత్ర!

Update: 2018-02-25 06:58 GMT
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొత్తగా వలసలు వచ్చిన వారిలో రేవంత్ రెడ్డిని మాత్రం ప్రత్యేకంగానే చూస్తున్నది.. ఆయన ద్వారా ప్రత్యేకమైన లాభం ఉంటుందదనే ఆశిస్తున్నది.. అనడానికి ఇది మచ్చు తునక. తెలంగాణలో పార్టీ తరఫున పాదయాత్ర చేయడానికి గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి - డికె అరుణ తదితరులందరికీ అనుమతి నిరాకరించిన కాంగ్రెస్ అధిష్ఠానం అదే సమయంలో రేవంత్ రెడ్డికి మాత్రం పచ్చజెండా ఊపింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంయుక్తంగా ప్రస్తుతం నిర్వహించబోతున్న బస్సు యాత్ర పూర్తయిన తరువాత.. రేవంత్ పాదయాత్ర షెడ్యూలును ఖరారు చేస్తారు.

కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈనెల 26వ తేదీనుంచి బస్సుయాత్ర ప్రారంభించబోతోంది. దాని తర్వాత రేవంత్ పాదయాత్ర ఉంటుందని అనుకుంటున్నారు. రేవంత్ తో పాటు మరో ఇద్దరు నాయకులకు కూడా పాదయాత్ర చేసే అనుమతి లభించింది. మల్లు భట్టివిక్రమార్క - పొన్నం ప్రభాకర్ కూడా పాదయాత్ర చేయబోతున్నారు. కాకుంటే భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలోను - పొన్నం కరీంనగర్ జిల్లాలోను మాత్రమే పాదయాత్ర చేస్తారు. అదే రేవంత్ పాదయాత్ర మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది.

రేవంత్ ద్వారా తమ పార్టీకి చాలానే లాభం ఉంటుందని అధిష్ఠానం ఆశిస్తున్నది అనడానికి ఇదే నిదర్శనం అని పలువురు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని ఎంతో సీనియర్ నాయకులు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఒక రేంజిలో విరుచుకుపడుతున్నప్పటికీ.. దానివల్ల పార్టీకి వస్తున్న మైలేజీ పెద్దగా లేదని కాంగ్రెస్ భావిస్తున్నట్లుంది. రేవంత్ రెడ్డి తూటాల్లాంటి చాలా నిశితమైన విమర్శలతో కేసీఆర్ మీద విరుచుకుపడడంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ నేపథ్యంలో.. ఆయనను తురుపుముక్కలాగానే వాడాలని అనుకుంటున్నారు.

రేవంత్ పార్టీలో  చేరి ఇంచుమించుగా మూడు నెలలు దాటుతున్నప్పటికీ.. ఇప్పటిదాకా ఆయనకు పార్టీలో నిర్దిష్టంగా ఫలానా అంటూ పదవి గానీ, బాధ్యత గానీ కేటాయించలేదు. అయితే తొందర్లోనే ఆయనకు రాష్ట్రస్థాయిలో ఒక కీలక పార్టీ పదవిని కట్టబెడతారనే వార్తలు గాంధీభవన్ లో వినిపిస్తున్నాయి. బస్సుయాత్ర పూర్తయి - ఆయన పాదయాత్రను ప్రారంభించేలోగా.. ఆయనకంటూ ఓ పార్టీ హోదాను ఇచ్చే.. ఆ స్థాయిలోనే యాత్ర చేసేలా ప్లాన్ చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News