టీ కాంగ్రెస్ కు రేవంత్ రాజీనామా షాక్!

Update: 2018-09-06 06:43 GMT
ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ముందస్తు ఎన్నిక‌ల హ‌డావిడి మొద‌లైన సంగ‌తి తెలిసిందే.  ఈ రోజు మ‌ధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీని సీఎం కేసీఆర్ ర‌ద్దు చేయ‌బోతున్నార‌ని, మంత్రివ‌ర్గ స‌మావేశం అనంత‌రం ఈ విష‌యాన్ని మీడియాకు వెల్ల‌డించ‌నున్నార‌ని ఊహాగానాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో మ‌రో అనూహ్య ప‌రిణామం జ‌రిగింది. ముంద‌స్తుకు అస్త్ర శ‌స్త్రాలు సిద్ధం చేసుకుంటోన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాక్ త‌గిలింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు - కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురువారం తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. స్పీకర్ ఫార్మాట్లో తన రాజీనామా లేఖను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి అందించ‌బోతున్నారు.

నేడు మ‌ధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తారని జోరుగా ప్రచారం జ‌రుగుతోన్న నేప‌థ్యంలో రేవంత్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు.  త‌న రాజీనామా లేఖ‌ను స్పీకర్ మధుసూదనాచారికి ఇచ్చేందుకు రేవంత్ ప్రయత్నించారు. అయితే, ఆయ‌న అందుబాటులో లేక‌పోవ‌డంతో ఆ రాజీనామా లేఖను అసెంబ్లీ కార్య‌ద‌ర్శ‌కి స‌మ‌ర్పించేందుకు రేవంత్ సిద్ధ‌మ‌యిన‌ట్లు తెలుస్తోంది. అసెంబ్లీ రద్దుకు ముందుగా తానే రాజీనామా చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మ‌రోవైపు, గతంలోనే రేవంత్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా.. లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి అందించారు. అయితే, స్పీకర్ కు ఆ లేఖ అందకపోవడంతో రాజీనామా ఆమోదం పొందలేదు. ఈ క్ర‌మంలో నేడు మ‌రోసారి రాజీనామా స‌మ‌ర్పించారు. మ‌రోవైపు, తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేసే అవకాశమున్న‌ట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News