వ్యాధులున్న మంత్రులు సూసైడ్ చేసుకోరే?

Update: 2015-09-11 12:52 GMT
ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తన పేరుకు తగ్గట్లే తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ నడిబొడ్డున కరెంటు స్తంభానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న లింబయ్యకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న తీరుపై మండిపడిన ఆయన.. తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మకు వినతిపత్రం ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లింబయ్య ఆత్మహత్య అప్పులతో కాదని.. దీర్ఘకాలిక వ్యాధితోనే చేసుకుందంటూ తెలంగాణ సర్కారు తేల్చిన నివేదికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్.. కేసీఆర్ సర్కారులో చాలామంది వ్యాధులున్న మంత్రులు ఉన్నారని వారెవరూ ఎందుకు సూసైడ్ చేసుకోలేదంటూ సూటిగా ప్రశ్నించారు.

ఆర్థిక సమస్యలతో కాదు.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యతోనే ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నతెలంగాణ ప్రభుత్వ మాట నిజమే అయితే.. తెలంగాణ సర్కారులో కీలకపదవిలో ఉన్న వ్యక్తి దీర్ఘకాలంగా ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని.. మరి.. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదని నిలదీశారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా రెండు నెలలుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారని.. ఆయనెందుకు ఆత్మహత్య చేసుకోవటం లేదని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం ఆత్మహత్యల రాష్ట్రంగా మారిపోయిందని.. తెలంగాణ సర్కారు కొలువు తీరిన తర్వాత ఇప్పటివరకూ 1300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో సైతం తెలంగాణలో 883 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణరాష్ట్ర మంత్రులు హరీశ్ రావు.. కేటీఆర్ ఇద్దరూ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతూ.. మానసిక వ్యాధితో ఇబ్బంది పడుతున్నారని.. అయినా వారెందుకు ఆత్మహత్యలు చేసుకోలేదని మండిపడిన ఆయన.. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలపై సమగ్ర సమాచారం తెప్పించి ఆదుకోవాలన్నారు.
Tags:    

Similar News