రేవంత్‌ పై ఢిల్లీ గుస్సా..సొంతంగా వెళ్లేందుకే నిర్ణ‌యం

Update: 2018-05-13 14:21 GMT
వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి అధికార టీఆర్ఎస్ పార్టీకి గ‌ట్టిపోటీ ఇవ్వాల‌ని భావిస్తున్న ప్రధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌కు అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు కొత్త స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తున్నాయ‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. పార్టీకి బ‌ల‌మవుతార‌ని భావించి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇబ్బందిక‌రంగా మారార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే స‌మ‌యంలో త‌న‌ను గుర్తించ‌డం లేద‌ని ఆయ‌న వాపోతున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో రేవంత్ కొత్త మార్గాన్ని ఎంచుకున్నార‌ని, ఈ ప‌రిణామం కాంగ్రెస్ వ‌ర్గాల‌ను ఒకింత అయోమ‌యానికి గురి చేస్తోంద‌ని అంటున్నారు.

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ బ‌ల‌హీన‌ప‌డటం, త‌న టార్గెట్ అయిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఎదుర్కునేందుకు కాంగ్రెస్ స‌రైన వేదిక‌గా భావించిన కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆ పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఈ చేరిక స‌మ‌యంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష ప‌ద‌వి లేక ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్‌ పదవుల్లో ఏదో ఒకటి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే నెల‌లు గ‌డిచినా ఈ హామీ ఆచ‌ర‌ణ రూపం దాల్చ‌లేదు. సాక్షాత్తు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీలో చేరిన రేవంత్‌రెడ్డికి ఎలాంటి పదవి రాకుండా కొంత మంది సీనియర్లు అడ్డుకుంటున్నారని రేవంత్ స‌న్నిహిత వ‌ర్గాల ఆరోప‌ణ‌. దీంతో అధిష్టానం ఇచ్చిన వాగ్దానాలు అమలు కాకపోవడంతో ఇటీవ‌ల రేవంత్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ‌తవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవితోపాటు పార్టీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్‌ నేతలపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి రేవంత్‌ వైఖరి చర్చనీయాంశంగా మారింది. రేవంత్‌రెడ్డిపై ఇప్పటికే గుస్సాగా ఉన్న నేతలంతా ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడుగా ఇటీవ‌ల రేవంత్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు సైతం పార్టీలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తోంది. గ‌తంలో గాంధీభవన్‌లో ప్రెస్‌కాన్ఫరెన్స్‌లు పెట్టే రేవంత్ రెడ్డి...అక్కడికి రాకుండా ఇటీవల సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతున్నారు. మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన గాంధీభవన్‌కు రాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీ సీనియర్ల పై చేసిన వ్యాఖ్యలపై జానారెడ్డి, -భట్టి విక్రమార్క - హనుమంతరావు - షబ్బీర్‌ అలీ, - పొంగులేటి సుధాకరరెడ్డి అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. దీనిపై వివరణ ఇవ్వడానికి రేవంత్‌రెడ్డి రెండు రోజులపాటు ఢిల్లీలో మకాం వేయాల్సి వచ్చినట్టు తెలిసింది.రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇమేజ్‌ ఉన్న తనను పార్టీ పట్టించుకోవడం లేదని అధిష్టానం వద్ద తన ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీ పదవి లేకుండా ఇతర జిల్లాలకు, వేరే నియోజకవర్గాలకు పోవాలన్నా రేవంత్‌కు కొంత ఇబ్బందిగా మారింది. తన నియోజకవర్గం దాటి బయటకు పోవడానికి వీలులేకుండాపోయింది. నియోజకవర్గాలకు ఎవరైనా ఆహ్వానించినా పార్టీ అధ్యక్షుడిని సంప్రదించాల్సి వస్తున్నది. దీంతో ఎక్కడికి వెళ్లకుండా తన నియోజకవర్గానికి పరిమితం అవుతున్నట్టు తన గోడు వెళ్లబోసుకున్నట్టు తెలిసింది. రేవంత్‌ వివరణతో సంతృప్తి చెందని అధిష్టానం...పదవిపై తొందర పడవద్దని కూడా సర్ది చెప్పినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఇప్పుడు ఉన్న గ్రూపుల‌కు తోడుగా రేవంత్ మ‌రో గ్రూపును ఏర్పాటు చేశార‌ని అంటున్నారు.
Tags:    

Similar News