అనుకున్నదే జరిగింది.. ఈ మాత్రం దానికి ఇంత సాగదీత అవసరమా?

Update: 2021-06-27 04:36 GMT
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం చాలా ముఖ్యం. రాజకీయ రంగంలో ఇది చాలా అవసరం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ విషయంలో మాత్రం ఇదేమీ వర్తించదు. అందుకే.. బలపడేందుకు అవకాశం ఉన్నప్పటికి.. ఆ లాభాన్ని తమ ఖాతాలోకి మళ్లించే విషయంలో ఆ పార్టీ పదే పదే తప్పులు చేస్తోంది. తాజాగా రేవంత్ ఎపిసోడ్ తీసుకుంటే కాంగ్రెస్ చేసే తప్పులెన్ని అన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి మూడున్నరేళ్ల క్రితం వచ్చిన ఆయన.. అంచలంచెలుగా ఎదగటమే కాదు.. తమ సామర్థ్యాన్ని కాంగ్రెస్ అధినాయకత్వానికి నమ్మకం కలిగేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. అయితే.. టీపీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్ ను ఎంపిక చేస్తూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రత్యేకంగా వచ్చే లాభం ఏమీ లేదు. ఎందుకంటే..ఆయన్ను తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా  ఎంపిక చేయటాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. వేరే పార్టీ నుంచి వచ్చిన రేవంత్ కు కాంగ్రెస్ పార్టీ పగ్గాలుఎలా ఇస్తారంటూ పలువురు సీనియర్లు ప్రశ్నిస్తున్నప్పటికీ.. అధినాయకత్వం మాత్రం రేవంత్ రెడ్డి మీదనే విశ్వాసం పెట్టింది.

ఈ మాత్రం దానికి ఇంత హడావుడి ఎందుకు? అన్నది ప్రశ్నగా మారింది. రేవంత్ కాబోయే టీపీసీసీ చీఫ్ అన్న విషయంపై ఇప్పటికే మీడియా బోలెడన్ని కథనాల్ని ఇవ్వటం తెలిసిందే. ఇప్పుడు చేసే ప్రకటన ఏదో.. ఇంతకు ముందే రేవంత్ పేరును అధికారికంగా ప్రకటించి ఉంటే.. పార్టీలో అంతర్గతంగా ఉన్నపంచాయితీల్ని ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చి ఉండేవన్న మాట వినిపిస్తోంది. అదే పనిగా సాగదీస్తూ.. అంచనా వేసిన ఫలితాన్నే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించి ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎక్కాల్సిన ట్రైన్ జీవితకాలం లేటు అన్నట్లుగా.. రేవంత్ కు టీపీసీసీ పగ్గాల్ని అప్పగించే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కాల్సిన ట్రైన్ ను చాలా ఆలస్యంగా ఎక్కిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News