షర్మిలతో రాయబారం.. హైదరాబాద్ వచ్చిన జగన్ దూత?

Update: 2021-02-11 14:30 GMT
తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించిన ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిలతో రాయబారాలు మొదలయ్యాయి. తెలంగాణలో రాజన్నరాజ్యం తెస్తానంటూ ప్రకటించి ముందుకెళుతున్న వైఎస్ షర్మిలను తాజాగా వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ సీఎం జగన్ కు ఎంతో సన్నిహితుడైన ఆర్కే మంగళగిరి నుంచి హైదరాబాద్ వచ్చి లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో గురువారం మధ్యాహ్నం షర్మిలతో భేటి అయ్యారు.

షర్మిలతోపాటు ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ తో కూడా రామకృష్ణారెడ్డి సుధీర్ఘ మంతనాలు జరిపారు.వైఎస్ జగన్ అనుమతితోనే షర్మిలను ఆళ్ల రామకృష్ణారెడ్డి కలిసినట్లు తెలుస్తోంది. జగన్ దూతగా షర్మిలతో మాట్లాడేందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చారని సమాచారం. జగన్ ఏం చెప్పారు? షర్మిల వెనక్కి తగ్గుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

షర్మిల ప్రస్తుతం తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా నల్లగొండ జిల్లా నేతలతో వైఎస్ షర్మిల సమావేశం ఇటీవల  ముగిసింది. త్వరలో మరిన్ని జిల్లాల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈనెల 21న ఖమ్మంలో వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. పోడు భూముల అజెండాగా ఖమ్మంలో సమ్మేళనం నిర్వహించనున్నారు. వైఎస్ఆర్ అభిమానులతోపాటు గిరిజనులతో షర్మిల సమావేశం కానున్నారు. 21న ఉదయం లోటస్ పాండ్ నుంచి భారీ కాన్వాయ్ తో ర్యాలీగా షర్మిల ఖమ్మం వెళ్లనున్నారు.
Tags:    

Similar News