ఆర్కే న‌గ‌ర్ కాక‌... మ‌ళ్లీ మొద‌లైన‌ట్టే!

Update: 2017-11-24 08:27 GMT
ఆర్కే న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం... పేరు చెబితే చాలు, ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎక్క‌డిదో, అక్క‌డి నుంచి ఎవ‌రు ప్రాతినిధ్యం వ‌హించారో ఇట్టే గుర్తుకు వచ్చేస్తుంది. త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం,  అన్నాడీఎంకే అధినేత్రిగా జ‌య‌ల‌లిత మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఆర్కే న‌గ‌ర్ నుంచే పోటీ చేశారు. అంత‌కుముందు ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేసిన జ‌య‌... తాను జైలుకు వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలోని ఆర్కే న‌గ‌ర్‌నే ఎంచుకున్నారు. ఆ సంద‌ర్భంగా జ‌రిగిన ఉప ఎన్నిక‌తో పాటు ఆ త‌ర్వాత జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లోనూ జ‌య అక్క‌డి నుంచే పోటీ చేశారు. మ‌రి జ‌య మ‌ర‌ణం త‌ర్వాత ఆ నియోజ‌క‌వ‌ర్గం ఖాళీగా ఉన్న‌ట్లే క‌దా. ఖాళీగా ఉంది కాబ‌ట్టే... మొన్నామ‌ధ్య ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల క‌మిష‌న్ ఏర్పాట్లు చేసింది. అయితే శ‌శిక‌ళ మేన‌ల్లుడు టీవీవీ దిన‌క‌ర‌న్ ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి గెల‌వాల‌ని ఉవ్విళ్లూరాడు. అమ్మ ప్రాతినిధ్యం వ‌హించిన నియోజక‌వ‌ర్గంలో గెలిస్తే... పార్టీపై ప‌ట్టుతో పాటు త‌మ‌కు వ్య‌తిరేకంగా నిలిచిన పార్టీ ముఖ్యుల‌కు కూడా చెక్ పెట్ట‌వ‌చ్చ‌న్న‌ది దిన‌క‌ర‌న్ యోచ‌న‌గా వినిపించింది.

అయితే పార్టీలోని కుమ్ములాట‌లు ఎక్క‌డ త‌న‌ను ఓట‌మిపాలు చేస్తాయోన‌న్న భ‌యంతో దిన‌క‌ర‌న్ డ‌బ్బుల సంచుల‌ను అక్క‌డ దింపారు. దీనిపై స‌మాచారం అందుకున్న ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆ డ‌బ్బుల మూట‌ల‌ను స్వాధీనం చేసుకుని... ఏకంగా ఉప ఎన్నిక‌ను వాయిదా వేసింది. ఈ వ్య‌వ‌హారం ఒక్క త‌మిళ‌నాటే కాకుండా దేశవ్యాప్తంగా పెను సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. అయినా అయిపోయిన సంగతి గురించి ఇంత అవ‌స‌ర‌మా? అంటే... అవ‌స‌ర‌మే. ఎందుకంటే వ‌చ్చే నెల‌లో ఆర్కే న‌గ‌ర్‌కు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ బైపోల్స్ షెడ్యూల్‌ను కూడా ప్ర‌క‌టించేసింది. అమ్మ మ‌ర‌ణంతో ఖాళీ అయిన ఆర్కే న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక‌ను డిసెంబ‌రు నెలాఖ‌రులోగా పూర్తి చేయాల‌న్న మ‌ద్రాస్ హైకోర్టు ఆదేశాల మేర‌కు వేగంగా స్పందించిన ఎన్నిక‌ల సంఘం... కోర్టు తీర్పు వెలువ‌డ్డ రెండు, మూడు రోజుల్లోనే షెడ్యూల్‌ను ప్ర‌క‌టించేసింది. ఈ షెడ్యూల్ ప్ర‌కారం... డిసెంబ‌ర్ 21న ఆర్కే న‌గ‌ర్‌లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అదే నెల 24న కౌంటింగ్ పూర్తి అవుతుంది.

షెడ్యూల్ విడుద‌లైపోయింది కాబ‌ట్టి... ఆయా రాజ‌కీయ పార్టీలు ఆర్కే న‌గ‌ర్‌పై దృష్టి సారించేశాయి. ఇప్ప‌టికే ఈపీఎస్‌, ఓపీఎస్ వ‌ర్గానికే అన్నాడీఎంకే గుర్తు రెండాకుల సింబల్ ద‌క్కిన నేప‌థ్యంలో ఆ శిబిరంలో ఉత్సాహం క‌నిపిస్తోంది. అమ్మ గుర్తుగా ముద్ర‌ప‌డిపోయిన రెండాకుల గుర్తు త‌మ‌కే వ‌చ్చిన నేప‌థ్యంలో గెలుపు కూడా త‌మ‌దేన‌న్న ధీమాతో ఈ వ‌ర్గం ఉన్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ నుంచి త‌మ‌ను గెంటేసిన ఈపీఎస్‌, ఓపీఎస్ వ‌ర్గాల‌కు బుద్ధి  చెప్పేందుకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని టీవీవీ దిన‌క‌ర‌న్ యోచిస్తున్నార‌ట‌. ఆర్కే న‌గ‌ర్‌లో గ‌తంలో తానే పోటీకి దిగేందుకు య‌త్నించిన ఆయ‌న ఈ ద‌ఫా కూడా స్వ‌యంగా తానే రంగంలోకి దిగేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ట‌. ఇక మూడో ప‌క్షంగా విప‌క్ష డీఎంకే కూడా త‌న అభ్య‌ర్థిని నిల‌ప‌డం ఖాయంగానే కనిపిస్తోంది. ముక్కోణ‌పు పోటీ గ్యారెంటీగా క‌నిపించే ఈ పోరులో గెలుపు ఎవ‌రిని వ‌రిస్తుంద‌న్న అంశం నిజంగానే ఆస‌క్తిక‌రంగా మారింద‌నే చెప్పాలి.
Tags:    

Similar News