హుజూర్‌ న‌గ‌ర్లో టీఆర్ఎస్‌కు రోడ్ రోల‌ర్ టెన్ష‌న్‌!

Update: 2019-10-06 07:11 GMT
తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి కొత్త కలవరం మొదలైంది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి రోడ్డు రోలర్ గుర్తు కొన్ని నియోజకవర్గాల్లో షాక్ ఇచ్చింది. హుజూర్‌న‌గర్ లో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థికి వచ్చిన‌ ట్రక్కు గుర్తు వల్ల టిఆర్ఎస్ కారు గుర్తుకు పడాల్సిన 7 వేల ఓట్లు రోడ్డు రోలర్ గుర్తుకు పడ్డాయి. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కేవలం 7 వేల ఓట్లతో ఓటమిపాలయ్యారు. అలాగే మరి కొన్ని నియోజకవర్గాల్లో సైతం ట్ర‌క్కు గుర్తు వల్ల కారుకు పడాల్సిన ఓట్లు ఆ గుర్తుకు పడడం తో టిఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.

ఇక ఈ ఏడాది ఏప్రిల్లో లోక్‌స‌భ ఎన్నికల్లోనూ భువనగిరి నియోజకవర్గంలో ఏకంగా టిఆర్ఎస్ అభ్యర్థి ఓటమికి ఈ ట్ర‌క్కు కారణమైంది. భువనగిరి ఎంపీ సీటును టీఆర్ఎస్‌ కేవలం నాలుగు వేల ఓట్లతో కోల్పోయింది. ఈ ఎన్నిక‌ల్లో ట్ర‌క్కు గుర్తుకు భారీగా ఓట్లు పడ్డాయి. ఇక ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ మరోసారి  రోడ్డు రోలర్ గుర్తు టిఆర్ఎస్ ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత ఎన్నికల్లో ట్రక్కు గుర్తు వల్లే ఈ ఉప ఎన్నిక వచ్చిందని టిఆర్ఎస్ ఆరోపిస్తోంది. తాజా ఉపఎన్నికల్లో వంగపల్లి కిరణ్ కుమార్ అనే స్వతంత్ర అభ్యర్థికి ఎన్నికల సంఘం రోడ్డు రోలర్ గుర్తు కేటాయించింది.

వంగ‌ప‌ల్లి కిరణ్ కుమార్ రిపబ్లికన్ సేన అనే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చౌకబారు రాజకీయాలకు దిగి కారు గుర్తు పోలి ఉన్న గుర్తుల కోసం కొందరు అభ్యర్థులతో దరఖాస్తు చేయించిందని టిఆర్ఎస్ ఆరోపిస్తోంది. రోడ్డు రోలర్ గుర్తు మాత్రమే కాకుండా ట్రాక్టర్ నడిపే రైతు గుర్తు కూడా కాంగ్రెస్ రాజకీయాల వల్లే వచ్చిందని టిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక రోడ్డు రోల‌ర్ గుర్తుతో పోటీ చేస్తోన్న కిరణ్ మాత్రం తనకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని అంబేద్కర్ మనవడు ఆనంద్ రాజ్‌ అంబేద్కర్ నెలకొల్పిన రిపబ్లికన్ సేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నానని తెలిపాడు.

తాను ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి కాదని.. గతంలో సూర్యాపేట శాసనసభకు... నల్గొండ పార్లమెంట్ కు పోటీ చేస్తానని తెలిపాడు. గతంలో సూర్యాపేట నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు కూడా రోడ్డు రోలర్ గుర్తు మీద పోటీ చేశానని... కేవలం దళితవాదం వినిపించడానికే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని తనకు ఎలాంటి అధికార దాహం లేదని తెలిపాడు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నట్లు తనకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఏదేమైనా గత అనుభవాల దృష్ట్యా హుజూర్‌న‌గర్ లో రోడ్డు రోలర్ గుర్తు అధికార పార్టీని బాగా టెన్షన్ పెడుతోంది అన్నది మాత్రం వాస్తవం.
Tags:    

Similar News