ఈడీ ప్ర‌శ్న‌ల‌తో అల్లుడు గారు ఉక్కిరిబిక్కిరి!

Update: 2019-02-07 09:26 GMT
మ‌నీ లాండ‌రింగ్ కేసులో యూపీఏ ఛైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ అల్లుడు రాబ‌ర్ట్ వాద్రాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ) ప్ర‌శ్నించ‌డం తాజాగా క‌ల‌క‌లం సృష్టించింది. లండ‌న్ లో వాద్రాకు భారీగా అక్ర‌మాస్తులు ఉన్నాయ‌న్న‌ది ఈడీ అభియోగం. వాటిపై వాద్రా నుంచి స‌మాధానాలు రాబ‌ట్టేందుకు ఈడీ బాగానే ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది.

విచారణ నిమిత్తం బుధ‌వారం మ‌ధ్యాహ్నం మూడున్న‌ర గంట‌ల స‌మ‌యంలో వాద్రా త‌న స‌తీమ‌ణి ప్రియాంకా గాంధీతో క‌లిసి ఈడీ కార్యాల‌యానికి వ‌చ్చేశారు. భ‌ర్త‌ను అక్క‌డి డ్రాప్ చేసి ప్రియాంక వెళ్లిపోయారు. ఆపై ఐదున్న‌ర గంట‌ల‌పాటు ఈడీ వాద్రాను ప్ర‌శ్నించింది. 40కిపైగా ప్ర‌శ్న‌ల‌ను ఆయ‌న‌పై సంధించింది. వాటికి స‌మాధానాలు చెప్ప‌లేక వాద్రా ఉక్కిరిబిక్కిరి అయిన‌ట్లు తెలుస్తోంది. ఈడీ ప్ర‌శ్న‌ల‌కు ప్రియాంక భ‌ర్త ప‌లుమార్లు తీవ్ర అస‌హ‌నానికి గుర‌య్యార‌ని కూడా స‌మాచారం.

అయితే - ఈడీ ఎంత గుచ్చి గుచ్చి అడిగినా.. తీవ్ర అస‌హ‌నానికి గురిచేసినా వాద్రా త‌న మాట మార్చ‌లేద‌ట‌. లండ‌న్ స‌హా విదేశాల్లోనూ ఏ ఇత‌ర ప్రాంతంలోనూ త‌న‌కు అక్ర‌మ‌ ఆస్తులు లేనే లేవ‌నే స్ప‌ష్టం చేశార‌ట‌. వాద్రా విచార‌ణ కొన‌సాగుతుండ‌గా ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదిని అధికారులు అక్క‌డికి అనుమ‌తించ‌లేద‌ట‌. న్యాయ‌వాదిని మ‌రో గదిలో కూర్చోబెట్టార‌ట‌. ఈడీ జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ఐదుగురు ఇతర అధికారులు క‌లిసి వాద్రాను ప్ర‌శ్నించి.. ఆయ‌న నుంచి రాత‌పూర్వ‌క స‌మాధానాలు తెలుసుకున్న‌ట్లు తెలిసింది. లండన్‌ లోని 12, బ్య్రాన్ స్టన్‌ స్క్వేర్ లో 1.9 మిలియన్‌ పౌండ్లు ఖర్చు పెట్టి వాద్రా ఓ ఆస్తిని కొన్నాడనీ, అందుకోసం ఆయ‌న న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణికి పాల్ప‌డ్డాడ‌న్న‌ది వాద్రాపై ప్ర‌ధాన ఆరోప‌ణ‌.

ఈడీ విచార‌ణకు ముందు వాద్రా విలేక‌ర్ల‌తో మాట్లాడారు. తనకు విదేశాల్లో అక్రమాస్తులేవీ లేవన్నారు. రాజకీయ కుట్రతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనను వేధిస్తున్నార‌ని ఆరోపించారు. ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స‌హా ప‌లువురు విప‌క్ష నేత‌లు కూడా ఇదే త‌ర‌హా అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను ల‌క్ష్యంగా చేసుకొని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర‌ప్ర‌భుత్వం ఈడీ, సీబీఐల‌ను ప్ర‌యోగిస్తోంద‌ని ఆరోపిస్తున్నారు.
Tags:    

Similar News