కొడుకైనా కాల్చేయ‌మంటున్న ఆ దేశాధినేత‌

Update: 2017-09-23 04:48 GMT
గ‌తేడాది జూన్‌ లో ఫిలిప్పీన్స్ దేశ అధ్య‌క్షుడిగా రొడ్రిగో డ్యుటెర్టె బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. అప్ప‌టి నుంచి ఆయ‌న త‌మ దేశంలో విచ్చ‌ల‌విడిగా సాగుతున్న అక్ర‌మ మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణాపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అధ్య‌క్షుడి ఆదేశాల‌తో దాదాపు నాలుగు వేల మంది డ్ర‌గ్స్ వ్యాపారుల‌ను - స్మ‌గ‌ర్ల‌ను పోలీసులు కాల్చిచంపారు. మాన‌వ‌హ‌క్కుల సంఘాలు - అమెరికా వంటి దేశాలు కాల్చి చంప‌డంపై నిర‌స‌న వ్య‌క్తం చేసినా ఆయ‌న వెనుక‌కు త‌గ్గ‌లేదు.

 తాజాగా డ్ర‌గ్ రాకెట్ వ్య‌వ‌హారంలో డ్యుటెర్ట్ కుమారుడు పాలో డ్యుటెర్ట్‌ పాత్ర కూడా ఉంద‌ని ప్ర‌తిఫ‌క్షాల నుంచి తీవ్ర ఆరోప‌ణ‌లు వ్యక్త‌మ‌వుతున్నాయి. ఈ ఆరోప‌ణ‌ల‌పై తీవ్రంగా స్పందించిన డ్యుటెర్ట్.. త‌న కుమారుడు అక్ర‌మ ర‌వాణాకు పాల్ప‌డ్డాడ‌ని నిరూపిత‌మైతే కాల్చిపారేయాల్సిందేనంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలోనే డ్ర‌గ్స్‌ అక్ర‌మ ర‌వాణాలో పాలోపై ఆరోప‌ణ‌లు ఉండ‌టంతో పోలీసుల విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నారు. పాలో..  చైనాకు చెందిన డీల‌ర్ల‌తో క‌లిసి దేశంలోకి మాద‌క ద్ర‌వ్యాల‌ను అక్ర‌మ ర‌వాణా చేస్తున్నాడ‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.

అయితే ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల‌పై స్పందించిన ఫిలిప్పీన్స్ అధ్య‌క్షుడు డ్యుటెర్ట్‌.. డ్ర‌గ్స్ మాఫియాతో త‌న కుటుంబానికి ఎలాంటి సంబంధం లేద‌ని చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. త‌న‌ కుటుంబంలో ఎవ‌రైనా ఇలాంటి ప‌నులు చేస్తే అందరికి విధించిన శిక్షే విధిస్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ కుమారుడు పాలో డ్రగ్స్‌ రాకెట్‌ లో భాగస్వామి అని నిరూపించినట్టయితే అతడ్ని కాల్చిపారేయమని ఆదేశిస్తాన‌ని, త‌న కుమారుడిని చంపిన వారికి రక్షణ కూడా క‌ల్పిస్తాన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. డ్రగ్స్‌ సరఫరా చేసిన వారితోపాటు వీటిని అక్రమరవాణా చేస్తున్న వారిపై రొడ్రిగో ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే.
Tags:    

Similar News