ట్రెండింగ్: అంపైర్‌పై రోహిత్ ఫస్ట్రేషన్

Update: 2021-04-24 16:56 GMT
టీమిండియా క్రికెటర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ  క్రికెట్ మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ ఆవేశపడినట్టు కనిపించడు. పొరపాట్లు చేస్తే ఆటగాళ్లపై అరిచిన సందర్భాలు కూడా లేవు.  ప్రశాంతంగా ఉంటాడని ప్రసిద్ది చెందాడు. అయితే, గత రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ తన ప్రశాంతచిత్తాన్ని కోల్పోయాడు. రోహిత్ ఆన్-ఫీల్డ్ ఎంపైర్ పట్ల తన అసహనాన్ని చూపించాడు. ఐపిఎల్ లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు.

మోసెస్ హెన్రిక్స్ వేసిన తొలి ఓవర్లో రోహిత్ ఐదో బంతికి అవుట్ అయ్యాడు. మోసెస్ బంతిని లెగ్‌సైడ్ వైపు బౌలింగ్ చేయగా రోహిత్ దానిని కీపర్‌కు వదిలేశాడు.  ప్రత్యర్థి జట్టు కీపర్ క్యాచ్ కోసం ఎంపైర్ కు  విజ్ఞప్తి చేశాడు. అంపైర్ దానిని అవుట్ గా ఇచ్చాడు. నిరాశ చెందిన రోహిత్ వెంటనే ఒక సమీక్ష తీసుకున్నాడు. సమీక్షలో రోహిత్ బ్యాట్ బంతిని తాకలేదని.. అది అతని తొడ ప్యాడ్‌ను మాత్రమే తాకిందని తేలింది. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు.

సమీక్ష చేస్తున్నప్పుడు, రోహిత్ అంపైర్ పట్ల తన అసహనాన్ని చూపిస్తూ  సైగ చేయడం దుమారం రేపింది. ఎంపైర్ తీరుపై  ఫైర్ అయినట్టు కనిపించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఒక ఆటగాడు అంపైర్ తీసుకున్న నిర్ణయంపై స్పందించడం.. తప్పు పట్టడం నేరం.  రోహిత్ అంపైర్‌తో అసభ్యంగా ప్రవర్తించాడని నెటిజన్లు కూడా విమర్శించారు. ఇదిలావుండగా, ఈ సంఘటనపై ఐపిఎల్ బోర్డు ఇంకా స్పందించలేదు.
Tags:    

Similar News