అమలాపురం అల్లర్ల నిందితులపై రౌడీషీట్లు!

Update: 2022-06-14 05:50 GMT
ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ మే 24న జరిగిన విధ్వంసం, అల్లర్లకు సంబంధించి పోలీసుల విచారణ చురుగ్గా సాగుతోంది. ఈ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 268 మంది ఆందోళనకారులను గుర్తించారు.

ఇప్పటికే 142 మందిని అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న 126 మంది కోసం ఏడు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. నిందితులను సాంకేతిక ఆధారాలతో గుర్తిస్తున్నారు. సీసీ ఫుటేజీలు, గూగుల్‌ ట్రాక్‌లు, టవర్‌ లొకేషన్లు, వాట్సాప్‌ గ్రూపులు వంటి సాంకేతిక సాధనాల ఆధారంగా ఈ కేసులను 14 పోలీసు బృందాలు అత్యంత శాస్త్రీయంగా దర్యాప్తు చేస్తున్నాయి.

మరోవైపు పథకం ప్రకారం అమలాపురంలో విధ్వంసకర ఘటనలకు, అల్లర్లకు పాల్పడిన ఆందోళనకారులను ఎవరినీ వదలబోమని డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి చెబుతున్నారు. ఈ అల్లర్లలో కేసులు నమోదైన నిందితులందరిపైనా త్వరలోనే రౌడీషీట్లు తెరుస్తామని అంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసిన నేరానికి వారిపై పీడీపీపీ యాక్టు కింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

అలాగే కేసుల్లో ఉన్న ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఆస్తులను అకౌంట్‌బులిటీ చేస్తున్నారు. ఇప్పటికే నిందితుల వ్యక్తిగత ఆస్తులపై రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులతో అంచనాలు తయారు చేయించారు. నిందితుల ఆస్తులపై సుప్రీంకోర్టు, హైకోర్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసంలో మార్కెట్‌ రేట్లకు రెండురెట్లు అదనంగా నిందితుల వ్యక్తిగత ఆస్తుల నుంచి రికవరీ చేసే యోచనలో ఉన్నారు.

ఆ రోజు అమలాపురంలో జరిగిన అల్లర్లలో పాల్గొన్నది 16 నుంచి 25 ఏళ్ల లోపు పిల్లలు, యువకులేనని డీజీపీ చెబుతున్నారు. వీరంతా చదువుకుంటున్నారని, కేసులు పెడితే వారి భవిష్యత్‌ దెబ్బతింటుందని పోలీసులు ఆలోచించారని వివరించారు.

ప్రజాప్రతినిధుల ఇళ్లు, బస్సులు తగలబెడుతున్నా కాల్పులు జరపకుండా పోలీసులు ఎంతో సంయమనం పాటించారని, కాల్పులు జరిపితే కొంతమంది ఆందోళనకారులు చనిపోయి ఉండేవారని పేర్కొన్నారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అల్లర్లు, విధ్వంసం​ జరిగిన ప్రాంతాల్లో జూన్ 14న పర్యటించారు. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ ఇళ్లు, కలెక్టరేట్‌ కార్యాలయ ప్రాంతాలను పరిశీలించారు.
Tags:    

Similar News