ఆ చెత్త కుండీలో రూ.కోటి వెయ్యి నోట్లు

Update: 2016-12-19 06:50 GMT
చెత్తకుండీల్లో తిరుచ్చిలోని ఉరైయూర్ సాలై చెత్తకుండీ స్పెషాలిటీనే వేరని చెప్పాలి. దేశంలో మరే చెత్తకుండీ కూడా తరచూ వార్తల్లోకి ఎక్కిన రికార్డు ఉండదు. కానీ.. ఈ చెత్తకుండీ మాత్రం తరచూ వార్తల్లోకి  ఎక్కుతుంది. తాజాగా చోటు చేసుకున్న సంఘటన గురించి చెప్పటానికి ముందు రెండేళ్ల ప్లాష్ బ్యాక్ కు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. ఈ చెత్తకుండీలో రెండేళ్ల కిందట రూ.10లక్షల విలువైన నోట్లు దర్శనమిచ్చాయి. అప్పట్లో అదో పెద్ద వార్తగా మారింది.

తాజాగా.. పెద్ద నోట్లను రద్దు చేసిన వేళ.. బడా బాబులు తమ దగ్గరున్న పెద్దనోట్లను ఏం చేయాలో తోచని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా తిరుచ్చిలోని ఉరైయూర్ సాలై రోడ్డులోని చెత్తకుండీలో కోటి రూపాయిల విలువైన వెయ్యి రూపాయిల నోట్లు దర్శనమిచ్చాయి. చెత్త ఏరుకునే వారు చెత్తను తీసుకునే క్రమంలో భారీ ఎత్తున నోట్లు ముక్కలు ముక్కలుగా పడేసి ఉన్నాయి.

వీటిని తీసే క్రమంలో గాలికి.. నోట్ల ముక్కలు చెల్లాచెదురై వీధుల్లోకి పడిపోయాయి. దీంతో.. అక్కడి స్థానికులు ఆసక్తిగా చెత్తకుండీ వద్దకు చేరారు. అధికారులు సైతం.. చెత్త కుండీ దగ్గర పడేసిన నోట్ల ముక్కల్ని పరిశీలించి.. మొత్తం కోటి రూపాయిల మొత్తం వరకూ ఉంటుందని తేల్చారు. ఇలా ఒకటికి రెండు సార్లు పెద్ద ఎత్తున నగదు దొరికిన చెత్తకుండీ రికార్డు ఉరైయూర్ సాలై చెత్తకుండీకే దక్కుతుందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News