బీజేపీనే కాదు..ఆరెస్సెస్‌ కూ అంటుతున్న కాక.

Update: 2015-10-19 04:16 GMT
హిందూ జాతీయ వాదానికి ప్రతీకగా నిలిచే ఆరెస్సెస్ తొలిసారిగా డిఫెన్సులో పడిపోయింది. ఉత్తర ప్రదేశ్‌ లో హిందూ మూక ఒక ముస్లిం వ్యక్తిని ఆవు మాంసం తిన్నాడని ఆరోపించి చిత్రవధ చేసి చంపిన ఘటనను తానెన్నడూ సమర్థించలేదని బహిరంగ ప్రకటన చేసింది. ఇన్నాళ్లుగా బీజేపీ ముసుగులోని ఆరెస్సెస్ మంత్రులు, నేతలు ముస్లింలపై, గోవధపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా, క్షుద్రప్రకటనలు చేస్తున్నా స్పందించని ఆరెస్సెస్ దేశవ్యాప్తంగా సంస్థపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కళ్లు తెరిచింది. ఆరెస్సెస్ హిందీ పత్రిక పాంచజన్య ఉత్తరప్రదేశ్ ముస్లిం ముహమ్మద్ అక్లాక్ హత్యను పూర్తిగా సమర్థిస్తూ ఒక వ్యాసం ప్రచురించడంపై జాతీయ మీడియా మండిపడటంతో పాంచజన్య తన అధికార పత్రిక కాదంటూ తోసిపుచ్చింది. దాద్రిలో ముస్లింను వధించిన ఘటనను ఆరెస్సెస్ సమర్థింస్తోందంటూ వస్తున్న వార్తలు నిరాధారం, అసత్యం అని ఆరెస్సెస్ వ్యాఖ్యాత మన్మోహన్ వైద్య స్పష్టం చేశారు. హింసను తామెన్నడూ సమర్థించమని, దాద్రి ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నేరస్థులను శిక్షించమని ఇదివరకే కోరామని వైద్య తెలిపారు.

పాంచజన్య కానీ, దాని ఇంగ్లీష్ వెర్షన్ అయిన ఆర్గనైజర్ కానీ ఆరెస్సెస్ అధికారిక పత్రికలు కాదు, అధికార ప్రతినిధి మాత్రమే ఆరెస్సెస్ తరపున మాట్లాడగలడని సంస్థ సమర్థించుకుంది. కాగా ఇస్లామిక్ సదస్సులు, ముస్లిం నేతలు దేశ సంప్రదాయాలను ద్వేషించవలసిందిగా భారతీయ ముస్లింలకు ప్రబోధిస్తున్నారని, దుష్ట తలంపుతోటే దాద్రిలో ఆ ముస్లిం ఆవును చంపాడని పాంచజన్యలో అచ్చయిన ఓ వ్యాసం మీడియాలో విశేష చర్చలకు దారితీసింది. పైగా ఆ ముస్లింపై దాడి న్యూటన్ చర్యకు ప్రతిచర్య లాంటిదంటూ పాంచజన్య వ్యాఖ్యానించింది.

మతఛాందసానికి వ్యతిరేకంగా పోరాడుతున్న, రచనలు చేస్తున్న వారిని దేశవ్యాప్తంగా వధిస్తుండటంతో పలువురు కళాకారులు గతంలో సాహిత్య అకాడెమీలు తమకు బహుకరించిన అవార్డులను వెనక్కు ఇవ్వడం ఎన్డీఏ ప్రభుత్వ ప్రతిష్టను బాగా దెబ్బతీసిన నేపథ్యంలో పాంచజన్య బరితెగించి ముస్లిం వధను సమర్థించడం ఆగ్రహానికి కారణమవుతోంది.
Tags:    

Similar News