డిజిట‌ల్ విద్యావిధానం.. మ‌న‌దేశంలో సాధ్య‌మేనా..

Update: 2020-05-21 02:30 GMT
మ‌హ‌మ్మారి వైరస్ ప్ర‌వేశంతో భార‌త‌దేశం తీవ్ర క‌ష్టాలు ప‌డుతోంది. ఆ వైర‌స్ వ్యాప్తిని అరికట్ట‌డంటంలో భాగంగా దాదాపు రెండు నెల‌లుగా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ఈ లాక్‌డౌన్‌తో అన్ని రంగాలు స్త‌బ్దుగా మారాయి. ఏ ఒక్క కార్య‌క‌లాపం కొన‌సాగ‌డం లేదు. అన్ని రంగాలు మూత‌ప‌డ్డాయి. వీటిలో ప్ర‌ధానంగా విద్యారంగం. భార‌తీయ విద్యావిధానం జూన్ మొద‌లుకుని మార్చి వ‌ర‌కు ఉంటుంది. మార్చ్‌లో దాదాపు అన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. ఈ మార్చి స‌మ‌యంలోనే ఆ మ‌హ‌మ్మారి ప్ర‌బ‌లి ప‌రీక్ష‌ల‌న్నీ వాయిదా ప‌డేలా చేసింది. దీంతో విద్యా విధాన‌మంతా స‌ర్వ నాశ‌న‌మైంది. ప్ర‌స్తుతం విద్యార్థులంతా త‌మ కెరీర్‌ను దెబ్బ తీసుకునేలా మారింది. అకడమిక్ క్యాలెండర్ పూర్తిగా మారిపోయింది.

అయితే త్వ‌ర‌లోనే కొత్త విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం కావాల్సి ఉంది. కాక‌పోతే ఆ వైర‌స్ వ‌ల‌న వాయిదా ప‌డిన ప‌రీక్ష‌లు, విద్యా కార్యాచ‌ర‌ణ జూన్‌, జూలైలో పూర్తి చేసే అవ‌కాశం ఉంది. ఇక విద్యావిధానం సెప్టెంబ‌ర్‌లో ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు ఉన్న‌త విద్యామండ‌లి, యూజీసీ వంటి సంస్థ‌లు నివేదిక రూపొందించాయి. అయితే ఈ స‌మ‌యంలోనే కేంద్ర ప్ర‌భుత్వం డిజిట‌ల్ విద్యకు భారీ ప్రోత్సాహ‌కాలు ఇస్తూ ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ ప్యాకేజీలో ప్ర‌క‌టించింది. వ‌చ్చే విద్యా సంవత్సరంలో డిజిట‌ల్ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని భావిస్తూ ఈ మేర‌కు కార్యాచ‌ర‌ణ మొద‌లుపెట్టింది. అయితే భార‌త‌దేశంలో డిజిటల్ విద్యా విధానం సాధ్య‌మేనా అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ఎందుకంటే భార‌త‌దేశం ప్ర‌ధానంగా గ్రామీణ ప్రాంతం. పెద్ద సంఖ్య‌లో గ్రామాలు ఉన్నాయి. గ్రామీణ భార‌తంగా ఉన్న మ‌న‌దేశంలో డిజిటల్ విద్యా విధానంపై నీలిమేఘాలు అలుముకున్నాయి. వారానికి మూడు రోజులు పాఠ‌శాల‌లు, మూడు రోజులు డిజిటల్ తరగతులు కొన‌సాగించేలా ప్ర‌భుత్వం భావిస్తుండ‌గా అది సాధ్యమయ్యే ప‌ని కాద‌ని తెలుస్తోంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా డిజిట‌ల్‌గా అభివృద్ధి చెంద‌లేదు. ప‌ట్ట‌ణ ప్రాంతాల వ‌ర‌కు ఆ విధానం విజ‌య‌వంత‌మ‌య్యే అవ‌కాశం ఉంది.

దేశంలో చాలా రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు వెనుకబాటులో ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో డిజిటల్ విద్యా విధానం సాధ్యం కాదనే భావన ఉంది. ఆన్‌లైన్ విద్యా విధానం విద్యార్థి ఉన్నతికి దోహదం చేయ‌దనే భావన కూడా కొంత‌మంది మేధావులు చెబుతున్నారు. ఆన్‌లైన్ విద్యావిధానంతో విద్యార్థుల ఎదుగుద‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని, వారిలో సృజనాత్మకత బయటకు రాకపోవ‌డంతో పాటు, ఉపాధ్యాయులకు విద్యార్థి ఎలా ఉన్నాడో, ఏ సబ్జెక్ట్ వీక్ ఉన్నాడో తెలుసుకునే అవకాశం ఉండదని తెలుస్తోంది. మానసిక ఒత్తిడి పెరుగుతుందని కూడా చెబుతున్నారు.

సమష్టిగా ఉండటం, క్రమశిక్షణ పాటించడం, సమయపాలన వంటివి పాఠ‌శాల‌, క‌ళాశాల‌కు వెళ్తేనే సాధ్య‌మ‌వుతాయి. విద్యార్థికి త‌ర‌గ‌తి గ‌దే అన్ని నేర్పిస్తుంటుంది. అలాంటి ఇప్పుడు డిజిట‌ల్ అంటే వారిని త‌ప్పుదోవ ప‌ట్టించే ఆస్కారం కూడా ఉంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు డిజిట‌ల్ విద్య‌కు ప్ర‌తికూలంగా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతానికి చెందిన విద్యార్థులు వెన‌క‌బ‌డే అవ‌కాశం ఉంది. ఏది ఏమున్నా అన్ని ఆలోచించి ముంద‌డుగు వేయాల‌ని మేధావులు, విద్యావేత్త‌లు సూచిస్తున్నారు. ప్ర‌స్తుతం 2020 కొన‌సాగుతున్నా కొన్ని గ్రామాల్లో ఇంకా విద్యుత్ సౌక‌ర్యానికి నోచుకోనివి ఉన్నాయ‌ని, మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో డిజిట‌ల్ విద్యా ఎలా సాధ్య‌మ‌వుతుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. క్షేత్ర‌స్థాయిలో అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించి చ‌ర్య‌లు తీసుకుంటే బాగుటుంద‌ని ప‌లువురు చెబుతున్నారు. మ‌రొక స‌ల‌హా వినిపిస్తోంది. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో డిజిట‌ల్ విద్య అమ‌లుచేసి గ్రామీణ ప్రాంతాల్లో య‌థాత‌థ ప‌రిస్థితిని కొన‌సాగించాల‌ని కొంద‌రు సూచిస్తున్నారు.
Tags:    

Similar News