పోకెమాన్ గేమ్ ఆటగాళ్లకు ఇది శుభవార్తే!

Update: 2016-07-27 03:44 GMT
నడుస్తూ నడుస్తూ... ఎదురుగా ఉన్న అద్దాల త‌లుపుల‌ను ఢీ కొట్టాడు ఒకాయ‌న‌. ముఖానికి గాయం.. ఆసుప‌త్రి పాల‌య్యాడు. న‌డుస్తూ న‌డుస్తూ... ఎదురుగా వ‌స్తున్న వాహ‌నాన్ని చూసుకోలేదు - అంతే ఢీ కొట్టాడు మ‌రొక‌డు! బోన్స్ ఫ్రాక్చ‌ర్‌. న‌డుస్తూ న‌డుస్తూ... రైలు ప‌ట్టాల మీదికి వెళ్లిపోయాడు ఇంకొకాయ‌న‌! అంతే, రైలు వ‌చ్చేసింది! పోలీసు సిబ్బంది వెంట‌నే స్పందించ‌డంతో ప్రాణాపాయం త‌ప్పింది. వీళ్ల‌కి న‌డ‌క రాక కాదు... న‌డుస్తున్న‌ప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండ‌టం వ‌ల్ల‌, దాన్లో ఆ గేమ్ ఆడుతూ మైమ‌ర‌చి న‌డుస్తూ ఉండ‌టం వ‌ల్ల ఈ ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. ఇంత‌కీ, కొంత‌మందికి అంత‌గా వ్య‌స‌నం అయిపోయిన ఆ గేమ్ ఏంటంటే.. పోకెమాన్‌. ఈ ఆట మోజులో ప‌డితే కొంత‌మందికి వారేం చేస్తున్నారో కూడా ఒళ్లు తెలియ‌డం లేదు. ఆ ఆట‌లో ఉన్న మ‌జా సంగ‌తి అలా ఉంచితే... ఆ మ‌జా మ‌త్తులోప‌డి ప్ర‌మాదాలు జ‌రుగుతూ ఉండ‌టం విచార‌క‌రం.

పోకెమాన్ ఆడుతూ న‌దిలో ప‌డిపోయిన‌వారు... ఆడుతూ ఆడుతూ ఏకంగా దేశ స‌రిహ‌ద్దులు దాటి వెళ్లిపోతున్న‌వారు కూడా ఈ మ‌ధ్య వార్త‌ల్లో ద‌ర్శ‌న‌మిస్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎక్కువ అవుతూ ఉండ‌టంతో ర‌ష్యాకి చెందిన ఓ బ్యాంకు స్పందించింది. పోకెమాన్ ఆడేవాళ్ల‌కు ఏకంగా ఉచిత బీమా సౌక‌ర్యాన్ని ప్ర‌క‌టించింది. ఎస్‌ బేర్ అనే ర‌ష్య‌న్ బ్యాంక్ ఈ సరికొత్త ఇన్సూరెన్స్ పాల‌సీని ప్ర‌వేశ‌పెట్టింది. అయితే, కొన్ని ష‌ర‌తుల‌కు లోబ‌డి ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేస్తార‌ట‌. పోకెమాన్ ఆడుతూ ఏదైనా ప్ర‌మాదానికి గురైన వారికి 800 అమెరిక‌న్ డాల‌ర్ల‌ను ప‌రిహారంగా చెల్లించేందుకు బ్యాంక్ సిద్ధ‌ప‌డింది.

ఇది మ‌రీ విడ్డూరంగా ఉంది క‌దా! స్మార్ట్ ఫోన్‌ లో గేమ్స్ ఆడుతూ రోడ్డు మీద న‌డ‌వ‌డమే ఒక త‌ప్పు. ఒళ్లూ తెలియ‌కుండా ప్ర‌మాదాల‌కు కార‌ణం అవుతుండ‌టం ఇంకో త‌ప్పు.  అలాంటి వారికి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వ‌డం ఏంట‌ని కొంత‌మంది మూతి విరుస్తున్నారు కూడా! ఈ ఉచిత బీమా ప్ర‌క‌టించ‌డం సరికాదంటూ కొంత‌మంది సోష‌ల్ నెట్‌ వ‌ర్కింగ్ సైట్ల‌లో అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏదేమైనా, పోకెమాన్ గేమ్ కూడా వ్య‌స‌నాల జాబితాలో చేరిపోయింద‌నే చెప్పుకోవాలి మ‌రి!
Tags:    

Similar News